కరోనా లక్షణాలతో పెళ్లి కొడుకు మృతి.. వివాహానికి వెళ్లిన 95 మంది పాజిటివ్

కరోనా లక్షణాలతో పెళ్లి కొడుకు మృతి.. వివాహానికి వెళ్లిన 95 మంది పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 15న 15 మందికి పాజిటివ్ వచ్చింది. పెళ్లి కుమార్తెకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత మరికొంత మందికి టెస్ట్‌లు చేయగా.... మరో 85 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

 • Share this:
  భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 18వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఐతే బీహార్‌లో ఓ పెళ్లి కొడుకు కరోనా లక్షణాలతో మరణించాడు. వివాహం జరిగిన రెండు రోజులకే కన్నుమూశాడు. అంతేకాదు ఆ వివాహానికి హాజరైన వారిలో 95 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. బీహార్ రాజధాని పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల యువకుడు గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మే 12న పాలిగంజ్‌లో అతడి వివాహం జరిగింది. ఐతే అప్పటికే యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా వివాహ తంతు పూర్తి చేశారు.

  వివాహ అనంతరం ఆ యువకుడు, వధువుతో కలిసి స్వగ్రామం దీహ్‌పాలికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్నంలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. పెళ్లైన రెండు రోజులకే వరుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కరోనా లక్షణాలతో చనిపోయినప్పటికీ మృతదేహానికి పరీక్షలు చేయించలేదు. కరోనా నిబంధనలను విరుద్ధంగా అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

  ఐతే వరుడు కరోనా లక్షణాలతో మరణించాడన్న సమాచారం వైద్యాధికారులకు తెలియడంతో.. వారు గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. వివాహానికి హాజరైన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. జూన్ 15న 15 మందికి పాజిటివ్ వచ్చింది. పెళ్లి కుమార్తెకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత మరికొంత మందికి టెస్ట్‌లు చేయగా.... మరో 85 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇలా మొత్తం 95 మందికి కరోనా సోకవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వారి ద్వారా ఇంకెంత మందికి సోకిందోనని టెన్షన్ పడుతున్నారు. అధికారులు సైతం అప్రమత్తమై గ్రామంలో వీలైనంత ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.

  కాగా, బీహార్‌లో ఇప్పటి వరకు 9,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,374 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా..65 మంది మరణించారు. ప్రస్తుతం బీహార్‌లో 2,179 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
  First published:

  అగ్ర కథనాలు