తెలంగాణ ప్రభుత్వంపై అఖిలపక్షం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా చలనం లేదని విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో అఖిపక్షం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాలకంటి రాంగారెడ్డి, గోవర్ధన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. హైకోర్టు చెప్పినట్లుగా రాష్ట్రంలో విస్తృతంగా ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని అన్నారు. అంతేకాదు 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి రూ.7,500 తోపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలోనే పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశ పెట్టి పట్టణ ప్రజలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని పనికి సమాన వేతనం ఇవ్వాలి డిమాండ్ చేశారు కోదండరాం.
సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో అఖిలపక్షం డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. లేదంటే ఆగష్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Coronavirus, Covid-19, Hyderabad, Kodandaram, Telangana