news18-telugu
Updated: July 6, 2020, 6:35 PM IST
గవర్నర్ తమిళిసై
తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ వంద సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో... ప్రజల్లో దీనిపై ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా వ్యాప్తిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్కు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే ముందస్తు సమావేశాల కారణంగా ఈ సమావేశానికి రాలేమని ఉన్నతాధికారులు గవర్నర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు కరోనా రోగులకు అందిస్తున్న వైద్యం సహా పలు అంశాలపై చర్చించేందుకు రేపు ప్రైవేటు ఆస్పత్రులతో సమావేశం కానున్నట్టు గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించారు. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 23,902కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 295కి పెరిగింది. తెలంగాణలో ఈ రోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 115835 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశారు. అందులో 91933 నెగిటివ్ వచ్చాయి. 23,902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 10,904. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,703.
Published by:
Kishore Akkaladevi
First published:
July 6, 2020, 5:42 PM IST