P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18
ఒకటా రెండా.. ఎన్నో ఏళ్ల కల.. ఉత్తరాంధ్రలో చికిత్స పేరు చెబితే ఇప్పటికే కేజీహెచ్ ఒక్కటే దిక్కు.. అక్కడకు ఇతర జిల్లాలు, ఒడిశా రాష్ట్రాల నుంచి రోగులు వస్తుండడంతో.. ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. పెరుగుతున్న రోగులకు సరిపడ వైద్య సదుపాయాలు లేక.. అవస్థలు తప్పడం లేదు. అందుకే కేజీహెచ్ కు వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి. విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న గ్రామీణ ప్రజలు చికిత్స కోసం కేజీహెచ్ వరకు వెళ్లలకే.. దగ్గరలో మరో పెద్ ప్రభుత్వ ఆస్పత్రి లేక అవస్థలు పడుతూ వస్తున్నారు. ఎట్టకేలకు వారి కల సాకారమైయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా వైద్య రంగానికి, పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 14 మెడికల్ కాలేజీల్లో రెండు కాలేజీలను ఉత్తరాంధ్రకు కేటాయించింది. విజయనగరం పట్ణణంలోనూ, విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వైద్య కళాశాలలకు కూడా వర్చువల్ లో శంకుస్థాపన చేసారు. దీంతో మెడికల్ కాలేజీల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ జిల్లాల ప్రజల చిరకాల కోరిక తీరనుంది.
రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి వంతున 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో గత ఏడాది శంకుస్ధాపన చేసిన మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల కాలంలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడంతో పాటు శంఖుస్థాపన చేయనున్నారు. ఒక్కో వైద్య కళాశాలకు 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.
విశాఖపట్నం జిల్లా గ్రామీణ ప్రాంతానికి ముఖ్యకేంద్రమైన అనకాపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటు ఏర్పాటు చేయాలని, ఆధునిక సౌకర్యాలతో పెద్దాసుపత్రి కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు జరగనుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, డెలివరీలు, అత్యవసర పరిస్థితుల్లో విశాఖపట్నం జిల్లా కేంద్రానికి తరలించే పరిస్థితుల నుండి ఈ ప్రాంతవాసులు బయటపడనున్నారు. ఇక రానున్న కాలంలో అనకాపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా రూపొందనుంది. ఈ నేపధ్యంలో అనకాపల్లిలో వైద్య కళాశాల, ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకమనే చెప్పాలి.
ఇదీ చదవండి: వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూర్ వెళ్లాలా..? ఏపీ మెడికల్ హబ్ అవుతుందన్న సీఎం జగన్
అనకాపల్లి తుమ్మపాలరోడ్డులో వ్యవసాయ పరిశోధనా సంస్థకు సంబంధించిన 50 ఎకరాల స్థలంలో రూ.500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల రూపుదిద్దుకోబోతోంది. ఈ సముదాయంలో బోధన ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, వసతి గృహాలు, డాక్టర్ల క్వార్టర్లతో పాటు అతిథిగృహం, గ్యాస్ ప్లాంట్, బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్, ఓపెన్ ఎయిర్ థియేటర్ మొదలైన భవనాలను కూడా నిర్మిస్తారు. ముఖ్యంగా ఏజెన్సీతో పాటు గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతోంది. అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట ప్రాంతాల మీదుగా జాతీయరహదారులు ఉన్నాయి. ఈ జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ అనకాపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ఎంతో ఉపయోగపడనుంది.
ఇదీ చదవండి: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... CCRAS నివేదికలో ఏముందంటే?
ఇక విజయనగరం జిల్లా వాసుల కల నెరవేరుస్తూ విజయనగరం పట్టణానికి ఆనుకొని గాజులరేగ లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల లేని లోటు తీరుస్తూ, నేటినుంచి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని గాజులరేగ వద్ద సర్వే నెంబరు 1/89 లోని 70 ఎకరాల స్థలాన్ని వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం ప్రస్తుత జిల్లా కేంద్రాసుపత్రికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో, 26వ నెంబరు జాతీయ రహదారికి కేవలం 0.5 కిలోమీటరు దూరంలో, అందరికీ అందుబాటులో ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కేటాయించారు. కానీ ఇంతలో ప్రభుత్వం మారడంతో.. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాబోతుంది. జిల్లాలో ప్రైవేటు రంగంలో ఒక మెడికల్ కాలేజీ ఉన్నా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేకపోవడంతో విజయనగరం జిల్లా వాసులంతా అత్యవసర సేవల కోసం విశాఖ కేజీహెచ్ కో లేదా మరో పెద్ద ఆసుపత్రికో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఏర్పాటవబోతున్న మెడికల్ కాలేజీ ద్వారా అన్ని విభాగాలకు చెందిన అత్యవసర సేవలను ఇక్కడే పొందే అవకాశం ఉంటుంది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, బొబ్బిలి వంటి మైదాన ప్రాంత నియోజకవర్గాలతో పాటు.. సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజవర్గాల ప్రజలకు అత్యవసర సేవల ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా మీదుగా రెండు జాతీయ రహదారులు, అంతరరాష్ట్ర రహదారులు వెళ్తున్నాయి. నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేటాయించిన మెడికల్ కాలేజీ ఏర్పాటైతే అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదీ చదవండి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. సండలింపులపై సీఎం జగన్ ఏమన్నారంటే?
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైతే, అత్యంత ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటిలా మరింత మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ బోధనాసుపత్రిలో అన్ని ఓపి, సర్జరీ, ఫిజియోథెరపీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సెకాలజీ, మైక్రో బయాలజీ, ఇఎన్‌టి, ఆఫ్తమాలజీ, ఎస్‌పిఎం, మెడికల్ సర్జరీ, గైనిక్, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ తదితర విభాగాలు ఏర్పాటవుతాయి. బోధన, బోధనేతర సిబ్బంది సుమారు 200 మంది వరకూ ఈ వైద్య కళాశాలకు అవసరం ఉంటుందని అంచనా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.