Lockdown: ఆ దేశంలో మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే..

ప్రతీకాత్మక చిత్రం

Lockdown: దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశమైన అనంతరం జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    ఓ వైపు ప్రపంచంలోని అనేక దేశాలు తమ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంటే.. జర్మనీ మాత్రం లాక్‌డౌన్ విధించేందుకు సన్నద్ధమవుతోంది. కరోనా కట్టడికోసం జర్మనీలో డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు లాక్‌డౌన్ విధించనున్నట్టు జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశమైన అనంతరం మెర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మెర్కెల్.. కరోనా కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

    రాబోయే క్రిస్మస్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి లాక్‌డౌన్ ఆదేశాలు అమలులోకి వస్తాయని అక్కడ ప్రభుత్వం తెలిపింది. నిత్యవసర వస్తులకు సంబంధించిన మాల్స్‌కు ఈ లాక్‌డౌన్ ఆదేశాలు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో అన్ని సంస్థలు మూతపడనున్నాయి. తాజాగా జర్మనీలో 20200 కొత్త కేసులు నమోదు కాగా, 321 మంది చనిపోయారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇతర కేంద్రాలు నవంబర్ నుంచి మూతపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి.

    న్యూ ఇయర్ వేడుకలపై దేశంలో నిషేధం విధించారు. క్రిస్మస్ సందర్భంగా కేవలం ఐదుగురు మాత్రమే ఒక చోట చేరడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా ఆరోగ్య రంగంపై అధిక భారం పడుకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మెర్కెల్ తెలిపారు. మిగతా యూరోప్ దేశాలతో పోలిస్తే.. కరోనా కట్టడి విషయంలో జర్మనీ మెరుగ్గానే ఉంది. అయితే ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక జర్మనీలో ఇప్పటి వరకు 13లక్షల మంది కొవిడ్ బారినపడగా.. ఇందులో 22వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published: