Emirates: యూఏఈ సంచలన నిర్ణయం.. భారత్ నుంచి దుబాయికి విమానాల రాకపోకలు బంద్.. ఎప్పటినుంచంటే..

యూఏఈ విమాన సర్వీసులు (ప్రతీకాత్మక చిత్రం)

యూఏఈ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విమానాల రాకపోకలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల పాటు రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు..

  • Share this:
    భారత్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు దేశ ప్రజలనే కాదు ప్రపంచ దేశాలను కూడా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ విజృంభణ స్థాయి మరింత పెరిగి కేసుల సంఖ్య గతంలో కంటే రెట్టింపు అవుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో రాష్ట్రాలన్నీ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. అవసరమయిన చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూని విధిస్తున్నాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలంటూ పిలుపునిస్తున్నాయి. అయితే దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే అంతర్జాతీయంగా భారత్ లో నెలకొన్న స్థితులు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే భారత్ నుంచి రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా యూఏఈ కూడా అదే దిశగా నిర్ణయం తీసుకుంది.

    భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ యూఏఈ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పడం లేదంటూ వ్యాఖ్యానించింది. ఆదివారం నుంచి పది రోజుల పాటు విమానాల రాకపోకలపై నిషేధం ఉంటుందని తేల్చిచెప్పింది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో గల్ఫ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు దుబాయికి వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి నిత్యం భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి దుబాయికి విమానాల సర్వీసులు నడుస్తున్నాయి.

    తాజాగా యూఏఈ తీసుకున్న నిర్ణయంతో గల్ఫ్ లో ఉన్న భారతీయ కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఈ పది రోజుల నిషేధంతోనే ఆగిపోతారా? లేక ఈ నిషేధాన్ని మరింత కాలం కొనసాగిస్తారా? అని భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలపై నిషేధం తప్పదా? అన్న అనుమానాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, చైనా దేశాలు కూడా భారత్ కు రాకపోకల విషయంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా యూఏఈ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published: