Good News: ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ యూనిట్.. ఎక్కడంటే..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆంధప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ యూనిట్ ప్రారంభం కానుంది. ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి.. ఎప్పటికి తొలి వ్యాక్సిన్ యూనిట్ అందుబాటులోకి రానుంది..?

  • Share this:
    ఏపీలో కరోనా కేసుల సంఖ్య పూర్తి తగ్గు ముఖం పడుతున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. దానికి తోడు కర్ఫ్యూ లాంటి నిబంధనల కారణంగా కరోనా కేసులు కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో తొలి వ్యాక్సినేషన్‌ తయారీ యూనిట్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఇండస్‌ జీన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ లిమిటెడ్‌ 720 కోట్లతో బయో టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ యూనిట్‌ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో 220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ సిద్ధమవుతున్న బయో టెక్నాలజీ యూనిట్‌ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేయనున్నారు.

    యూనిట్‌ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. బయో మెడిసిన్‌ ఉత్పత్తి, ల్యాబ్స్‌ను పరిశీలించారు. మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. బయో టెక్నాలజీ హబ్‌గా ఎదిగేందుకు అనంతపురం జిల్లాకు అపార అవకాశాలున్నాయని చెప్పారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని చెప్పారు.

    ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతున్న తొలి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం. త్వరలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా స్థానికంగా వెయ్యి మంది బయో టెక్నాలజీ సైంటిస్టులు, బయోకెమిస్ట్రీ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయని ఇండస్‌ జీన్‌ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు మరో 1,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది.
    Published by:Nagesh Paina
    First published: