1st Covid Patient: భారత్​లోని మొదటి కరోనా రోగికి మరోసారి పాజిటివ్.. ఎయిర్‌పోర్టులో..

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో మొట్టమొదటి కరోనా రోగి అయిన మహిళా మెడికోకు మరోసారి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది.

  • Share this:
చైనాలోని వూహాన్​ ల్యాబరేటరీస్​లో పుట్టిందని భావిస్తున్న కరోనా మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. మొదటగా చైనాలో బయటపడ్డ ఈ వైరస్​ భారత్​లోకి 2‌‌020 జనవరి 30న అడుగుపెట్టింది. కేరళకు చెందిన ఒక వైద్య విద్యార్థి ద్వారా భారతదేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. వైద్యుల చికిత్స అనంతరం కోలుకున్న ఆమె.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. అయితే అదే విద్యార్థినికి తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు.

చైనా వూహాన్​ విశ్వవిద్యాలయంలో మూడో సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని సెమిస్టర్​ సెలవుల్లో భాగంగా 2020 జనవరి 30న కేరళలోని స్వస్థలానికి చేరుకుంది. అయితే అప్పుడు భారత్​లో వైరస్​కు సంబంధించిన ఆంక్షలేమీ లేకపోవడంతో ఆమె సులభంగా భారత్​లోకి అడుగుపెట్టింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమెలో కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా​ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో దాదాపు మూడు వారాల పాటు వైద్యులు ఆమెకు చికిత్స అందజేశారు. వైరస్ నుంచి ఆమె పూర్తిగా కోలుకున్నాక 2020 ఫిబ్రవరి 20 న డిశ్చార్జ్ చేశారు. అయితే అప్పటికే ఆమె వల్ల అనేక మందికి కరోనా సోకింది. ఇలా ఒకరి నుంచి మరొకరికి సోకి వైరస్​ వేగంగా విస్తరించింది. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన ఇతర ప్రయాణికుల ద్వారా దేశంలో వైరస్ వేగంగా వ్యాపించింది. క్రమంగా​ రూపాన్ని మార్చుకుంటూ దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి​ భారత్​లో అల్లకల్లోలం సృష్టిస్తోంది.

మరోసారి పాజిటివ్​గా నిర్ధారణ..
భారతదేశంలో మొట్టమొదటి కరోనా రోగి అయిన సదరు మహిళా మెడికోకు మరోసారి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. త్రిశూర్‌లోని వైద్యాధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై త్రిస్సూర్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ కెజె రీనా పీటీఐతో మాట్లాడుతూ “భారత్​లో మొదటి కరోనా రోగికి మరోసారి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఆమెకు RT-PCR పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో పాజిటివ్​ అని తేలింది. అయితే యాంటిజెన్ టెస్ట్​లో మాత్రం నెగెటివ్ రిపోర్ట్​ వచ్చింది. ఆమెలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలింది" అని చెప్పారు. సదరు యువతి తన స్టడీ రీసెర్చ్​లో భాగంగా న్యూఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఎయిర్​పోర్ట్​లో ఆమె నమూనాలను పరీక్షించారు. అప్పుడు RT-PCR టెస్ట్​లో పాజిటివ్​గా తేలింది. దీంతో ఆ యువతిని ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్​ కెజె రీనా తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published: