దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే సీరమ్, భారత్ బయోటెక్ సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు ముందుగానే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేంద్రం డ్రైరన్ కూడా నిర్వహించింది. తాజాగా ఎప్పటి నుంచి దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 13న దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ డోసు ఇచ్చే అవకాశం ఉందని కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.
దేశంలో తొలుత నాలుగు వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతాలో ఉంటాయని.. దేశవ్యాప్తంగా ఆ తరువాత 37 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఇక్కడ పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను నిల్వ చేస్తామని.. ఆ తరువాత అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామని అన్నారు. వ్యాక్సిన్ల నిల్వతో పాటు వాటిలో ఉష్ణోగ్రతలను ఎప్పుటికప్పుడు డిజిటల్‌గా పర్యవేక్షిస్తామని తెలిపారు. దశాబ్దం పాటు వీటిని నిల్వ చేసే ఏర్పాట్లు మన దేశంలో ఉన్నాయని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని రాజేష్ భూషణ్ అన్నారు. వాటికి సంబంధించిన సమాచారం కో విన్ యాప్‌లో ఉంటుందని అన్నారు. ఇక దేశంలో కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ అంశంపై పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తమ రెండు కంపెనీలు దేశం కోసం, ప్రపంచ ప్రజల హితం కోసం పనిచేస్తున్నాయని స్పష్టం చేశాయి. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ల పంపిణీకి కలిసి పనిచేయనున్నట్లు సీరం,భారత్ బయోటెక్ అధినేతలు తెలిపారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే తమ రెండు కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. టీకాల అవసరంపై తమకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో రెండు టీకాలకు ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆమోదం దక్కిందని, ఇప్పుడు తమ దృష్టి మొత్తం ఉత్పత్తి, సరఫరా, పంపిణీపైనే ఉన్నట్లు సీరం, బయోటెక్ అధినేతలు తెలిపారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ల పంపిణీకి కలిసి పనిచేయనున్నట్లు వివరించారు. కోవిడ్19 వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా సాఫీగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.