కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కొన్ని దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ముందస్తుగా ఆయా దేశాల్లో వైద్య సిబ్బందికి కరోనా టీకాలను వేస్తున్నారు. ఇక, భారత్‌లో ఫైజర్ తమ టీకా అత్యవసర వినియోగానికి అనుమంతించాలని దరఖాస్తు చేసుకుంది. మరోవైపు దేశీయంగా అభివృద్ది చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ అనుమతి కోరింది. అయితే ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీంతో చాలా మంది ఆ తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మి ఆందోళన చెందుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, అసలు వాస్తవాలు ఏమిటనేది ఒకసారి చూద్దాం..
ప్రచారం : అమెరికాలో ఫైజర్ టీకా తీసుకున్న నర్సు మృతిచెందింది
వాస్తవం: అమెరికాలో ఫైజర్ టీకా తీసుకున్న నర్సు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సొమ్మసిల్లి కిందపడిపోయింది. అయితే తనకు గతంలో ఉన్న ఇబ్బందుల వల్లే ఇలా జరిగిందని ఆమె తర్వాత వెల్లడించింది. ప్రస్తుతం ఆ నర్సు ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
ప్రచారం: కొత్త రకం వైరస్లు పుట్టుకొస్తున్నాయి.. ఇప్పుడు అభివృద్ది చేసిన వ్యాక్సిన్ పనిచేయదు.
వాస్తవం: వైరస్ అనేది అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంటుంది. అలా రూపాంతరం చెందినంతా మాత్రాన అది బలపడినట్టు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ అభివృద్ది చేసేటప్పుడు వైరస్‌కు చెందిన అనేక రూపాల మీద పరీక్షలు జరుపుతారని డాక్టర్ ఫహీమ్ యూనస్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇక, బ్రిటన్‌లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ కొత్త వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోంది. ఐతే... ఇది కరోనా వ్యాధిని మరింత పెంచట్లేదు అలాగే మరణాల రేటును కూడా పెంచట్లేదు. అలాగని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రచారం: ఆక్స్‌ఫర్ట్ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లో నశించిన గర్భస్రావంలోని పిండ కణజాలాన్ని వినియోగిస్తున్నారు.
వాస్తవం: ఆస్ట్రాజెన్ వ్యాక్సిన్ తయారీలో మూత్రపిండాల కణజాలం నుంచి కణాలను సేకరించి అభివృద్ది చేశారు. కానీ అందులో ఎలాంటి పిండ కణజాలన్ని వినియోగించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Coronavirus, Fact Check, Fake news