Seroprevalence Survey: ఐసీఎంఆర్‌ తాజా సీరో సర్వేలో లోపాలు.. వాటి ప్రస్తావన లేదన్న నిపుణులు

ప్రతీకాత్మక చిత్రం

గత మూడు సీరో సర్వేల కోసం పరిగణనలోకి తీసుకున్న జిల్లాల్లోనే తాజా సర్వే నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. అయితే ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వేలో లోపాలను ఎత్తి చూపుతున్నారు కొందరు నిపుణులు.

  • Share this:
దేశ ప్రజల్లో కరోనా యాంటీ బాడీలను గుర్తించేందుకు ఐసీఎంఆర్ చేపట్టిన సీరో సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మూడింట రొండు వంతుల మంది ప్రజల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు సర్వే గుర్తించింది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు ఒక్క డోసు టీకా కూడా తీసుకోని వారు మేల్కోవాలని సర్వే నివేదిక హెచ్చరిస్తోంది. గత మూడు సీరో సర్వేల కోసం పరిగణనలోకి తీసుకున్న జిల్లాల్లోనే తాజా సర్వే నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటికే కరోనా మహమ్మారి రెండుసార్లు దేశంపై విరుచుకుపడింది. ప్రజలు అజాగ్రత్తగా ఉంటే మూడో ఉద్ధృతి సైతం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వేలో లోపాలను ఎత్తి చూపుతున్నారు కొందరు నిపుణులు.

దేశవ్యాప్తంగా నాలుగో సీరో సర్వేను జూన్‌-జులై మధ్య.. 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. గతంలో నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 28,975 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. వీరిలో 7,252 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి 10 గ్రామాలు లేదా వార్డులను మొదట ఎంపిక చేశారు. ఇందులో ఒక గ్రామం/ వార్డు నుంచి 40 మంది వ్యక్తులను గుర్తించారు. ఈ లెక్కన ప్రతి జిల్లాకు 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న 400 మంది వ్యక్తులను పరిశీలించారు. అలాగే ప్రతి జిల్లాలో 100 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులను కూడా ఎంపిక చేశారు.

సర్వేలో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని ఐసీఎంఆర్ తేల్చింది. అయితే 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది. సుమారు 10.5% హెల్త్ కేర్ వర్కర్లు టీకా తీసుకోలేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత.. చాలామంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాలేదు. అయితే వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన ఏడు నెలల తర్వాత కూడా ఈ సంఖ్య కొనసాగడం ఆందోళనకరమని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే సర్వేలో పాల్గొన్న హెల్త్ కేర్ వర్కర్లలో 13.4% మంది సింగిల్ డోస్, 76.1% మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పురుషుల్లో 65.8% మందిలో, మహిళల్లో 69.2% మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించింది. రెండు డోసులు తీసుకున్నవారిలో 89% మందిలో యాంటీబాడీలను గుర్తించారు. ఈ లెక్కల ఆధారంగా దేశంలో మూడింట రెండొంతుల మందిలో సార్స్ కోవ్-2 యాంటీబాడీలు ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. జనాభాలో ఒక వంతు.. అంటే ఇంకా 40 కోట్ల మందిలో యాంటీబాడీలు కనిపించలేదు. అంటే వీరంతా వైరస్‌ బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సర్వే గుర్తించింది. అందువల్ల యాంటీబాడీలు తగిన స్థాయిలో బయటపడని రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.

* పిల్లల పరిస్థితి ఏంటి?
6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో సగంమందికి పైగా యాంటీబాడీలు ఉన్నట్లు సీరో సర్వేలో తేలింది. ఈ విషయంలో పట్టణ, గ్రామీణ జనాభాలో పెద్ద తేడాలు లేవని తెలిపింది. అయితే ఈ అంశంపై కొందరు నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనాభా, వైరస్, వ్యాప్తి, కరోనా నిరోధక చర్యలు.. వంటి విషయాల్లో తేడాలు ఉంటాయి. కానీ సర్వే ఫలితాల్లో మాత్రం తేడాలు బయటపడకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ జాతీయ స్థాయి సర్వే.. స్థానిక (రాష్ట్ర / జిల్లా) పరిస్థితులకు ప్రత్యామ్నాయం కాదని సర్వే నివేదిక పేర్కొంది.

* భవిష్యత్తులో మరో ఉద్ధృతి ఉంటుందా?
కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత.. థర్డ్ వేవ్‌ భయాలు ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలో ప్రజలు, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరో ఉద్ధృతి తథ్యమని సర్వే నివేదిక స్పష్టంగా పేర్కొంది. సామాజిక, మతపరమైన, రాజకీయ సమ్మేళనాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలకు సూచించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే ప్రయాణాలకు అనుమతించాలని సూచించింది.

ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి పూర్తి స్థాయిలో టీకాలు వేయడం, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం.. వంటి కట్టడి మార్గాలను సిఫార్సు చేసింది. అయితే పరిమిత డేటాతో చేపట్టిన దేశవ్యాప్త సర్వేలో లోపాలు ఉన్నాయని చెబుతున్నారు కొందరు నిపుణులు. కరోనా యాంటీబాడీ స్థాయిలను గుర్తించడానికి రాష్ట్ర స్థాయిలో సీరో సర్వే చేయాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ఫలితాల కచ్చితత్వాన్ని గుర్తించడంతో పాటు తదుపరి కోవిడ్ వేవ్స్‌కు అవకాశం లేకుండా రాష్ట్రాలు ప్రణాళికలు వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* సర్వేలో పిల్లలపై థర్డ్ వేవ్ ప్రస్తావన ఏది?
పాశ్చాత్య దేశాల్లో మూడో దశ, నాలుగో దశలో సైతం వైరస్ విజృంభిస్తోంది. కానీ ఆయా దేశాల్లో వైరస్‌ ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపలేదు. భారత్‌లో సైతం కోవిడ్ థర్డ్ వేవ్‌ ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై ICMR తాజా సర్వేలో ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీనికి తోడు గతంలో రెండు నెలల వ్యవధిలో ఇచ్చిన ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయి.

థర్డ్ వేవ్ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని పేర్కొంటూ ఆరోగ్య రంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ గతంలో హెచ్చరించింది. ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ గులేరియా మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన ఇచ్చారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ప్రధానంగా ఉంటుందని చెప్పేందుకు ఆధారాలు లేవన్నారు. వారిలో రోగనిరోధక శక్తి బలంగా ఉన్నందువల్ల పాఠశాలలను క్రమంగా తెరవవచ్చని పేర్కొన్నారు. ఇవి ప్రజలలో గందరగోళాన్ని మరింత పెంచాయి.

* నివేదికలో లేని వేరియంట్ల ప్రస్తావన
ఈ సర్వే నివేదికలో వివిధ రకాల వైరస్ వేరియంట్ల వ్యాప్తి, వాటిని నిరోధించే యాంటీబాడీలు, జన్యుక్రమం విశ్లేషణ ప్రస్తావన లేదు. కరోనా వైరస్ వివిధ రకాల వేరియంట్లుగా రూపాంతరం చెంది వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ప్రజల్లో వీటిపై నెలకొన్న గందరగోళం, భయాన్ని తొలగించేందుకు తాజా సీరో సర్వే అదనపు సమాచారం అందిచాల్సిందని నిపుణులు చెబుతున్నారు. డెల్టా, డెల్టా ప్లస్, కప్పా, ఇతర వేరియంట్లను గుర్తించడంతో పాటు వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించడం అవసరమని సూచిస్తున్నారు. రానున్న రోజులో మరో ఉద్ధృతిని నివారించడంలో స్థానిక సీరో సర్వేలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
First published: