
రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
Rahul Gandhi: దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ నేత విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారత్ కన్నా బెటర్ గా కరోనాను కట్టడి చేస్తున్నాయంటూ మోదీ సర్కార్ ను ఎద్దేవా చేశారు.
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారత్ కన్నా బెటర్ గా కరోనాను కట్టడి చేస్తున్నాయంటూ కేంద్రంపై మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇది కూడా మోదీ సర్కార్ సాధించిన భారీ విజయం అంటూ ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్ తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఆరేళ్ల పాలనలో బీజేపీ సర్కార్ సాధించిన ఘనత ఇదంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన అంచనాలకు సంబంధించి గ్రాఫ్‌ను ఆయన తన ట్వీట్లో పోస్టు చేశారు.
ఇటీవల రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తరచుగా విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల హత్రాస్ లో దళిత యువతిపై అఘాయిత్యం ఘటనపై సైతం ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రియాంకా గాంధీతో కలిసి హత్రాస్ వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. రాహుల్, ఆయన అభిమానులకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చోటు చేసుకుంది. పోలీసులు తనను కింద పడేసి కొట్టారంటూ ఆ సమయంలో రాహుల్ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఆ మరుసటి రోజు రాహుల, ప్రియాంక హత్రాస్ జిల్లాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా బాధితురాలి తల్లిని అక్కున చేర్చుకుని ఓదార్చారు ప్రియాంకా గాంధీ. బాధితురాలి తల్లి కూడా ప్రియాంకా భుజంపై వాలి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
హత్రాస్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ‘యువతిని చూసేందుకు కనీసం ఆఖరి చూపు కూడా బాధిత కుటుంబానికి దక్కనివ్వలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన బాధ్యతలను గుర్తుంచుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’ అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కుటుంబం కోరుతుందని ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. అలాగే, ఆ కుటుంబానికి భద్రత కల్పించాలని సూచించారు. ఇక ప్రపంచంలో ఏ శక్తి కూడా హత్రాస్ బాధితుల గొంతు వినిపించనివ్వకుండా అడ్డుకోలేదని రాహుల్ గాంధీ చెప్పారు.
Published by:Nikhil Kumar S
First published:October 16, 2020, 14:20 IST