హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

గుడ్డెద్దు చేలో పడ్డట్టు పరీక్షలు చేయరు... ప్రతిపక్షాలకు మంత్రి ఈటల కౌంటర్...

గుడ్డెద్దు చేలో పడ్డట్టు పరీక్షలు చేయరు... ప్రతిపక్షాలకు మంత్రి ఈటల కౌంటర్...

మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల మీద ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల మీద ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు పరీక్షలు చేయరని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా మాత్రమే చేయాలనే విషయం తెలుసుకోవాలన్నారు. ఎన్ని పరీక్షలు చేశామన్నది ముఖ్యం కాదని, ఎంత కచ్చితత్వంతో పరీక్షలు చేస్తున్నామనేదే ప్రధానమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భంలో ట్రాక్ అండ్ ట్రీట్మెంట్ అనేది ప్రధానం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. భాద్యత లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఎలాంటి రాజకీయాలు, కులమతాలకు, ప్రాంతాలకు తావులేకుండా కరోనా వైరస్ మీద కలసికట్టుగా పోరాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిస్తుంటే, కొందరు రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘కేంద్ర బృందం హైదరాబాద్ లో పర్యటించి గచ్చిబౌలిని చూసి అబ్బురపడింది, గాంధీలో జరుగుతున్న చికిత్స పట్ల హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి గొప్పగా చెప్పారు. ఇది చూసి జీర్ణించుకోలేని స్థానిక బీజేపీ నేతలు నిజమా కాదా అని కేంద్ర బృందం దగ్గరికి వెళ్ళి ఆరా తీయడం సిగ్గుచేటు. అంటే కరోనా పోవద్దని బీజేపీ వారు అనుకుంటున్నారా?’ అని మంత్రి ప్రశ్నించారు. ఈ మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని మంత్రి ఈటల అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంటే ఢిల్లీ లో సమావేశాలకు అనుమతి ఇచ్చింది మీరే అనే విషయం మరచిపోవద్దు అని అన్నారు.

ఇండోనేషియా వాళ్ళు ఢిల్లీ వచ్చి అక్కడినుండి కరీంనగర్ వస్తే వారిని గుర్తించి కరోనా మూలాన్ని దేశానికి తెలియజేసిన రాష్ట్రం తెలంగాణ అని, 1244 మంది వారితో కలిసినా పదివేల మందికి పరీక్షలు చేసి కరోనాను కట్టడి చేశామని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు, జరిగే మరణాలు దాస్తే దాగవు అని, అలా చేసిన దేశాలు మూల్యం చెల్లించుకున్నాయి అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే కింగ్ కోటి హాస్పిటల్ కి రావాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Eetala rajender, Etela rajender, Telangana

ఉత్తమ కథలు