Sputnik V: స్పుత్నిక్ వ్యాక్సిన్ ధరను ఖరారు చేసిన డాక్టర్ రెడ్డీస్.. ఒక్క డోస్‌కు ఎంతంటే?

Sputnik V: స్పుత్నిక్ వ్యాక్సిన్ ధరను ఖరారు చేసిన డాక్టర్ రెడ్డీస్.. ఒక్క డోస్‌కు ఎంతంటే?

Sputnik V Vaccine(Reuters)

రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) సహకారంతో గమేలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ అభివృద్ధి చేసింది. భారత్‌‌లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.

  • Share this:
    మన దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను ప్రజలకు వేస్తున్నారు. ఐతే ఇప్పటికే రష్యా నుంచి వచ్చిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్..ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్ టీకా ధరను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ఖరారు చేసింది. జీఎస్టీతో కలిపి ఒక్క డోస్‌ను రూ.995.40కి అందించనున్నట్లు తెలింది. ఇందులో టీకా ధర రూ.948గా ఉంది. 5 శాతం జీఎస్టీతో కలిపి రూ.995.40 అందజేస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్నందున ధర ఎక్కువగా ఉందని.. ఇండియాలో టీకా ఉత్పత్తి ప్రారంభం అయిన తర్వాత ధర తగ్గే అవకాశముందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.


    రష్యా నుంచి పరిమిత సంఖ్యలోనే హైదరాబాద్‌కు స్పుత్నిక్ వ్యాక్సిస్‌లు వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి డోస్‌లను హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచే ప్రారంభించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ప్రకటించింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకోనుంది. ఇప్పటి వ్యాక్సిన్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పుత్నిక్ టీకాతో కొంత ఊరట లభించే అవకాశముంది.

    రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) సహకారంతో గమేలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ అభివృద్ధి చేసింది. భారత్‌‌లో స్పుత్నిక్ టీకా ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 2020 సెప్టెంబరులో డాక్టర్ రెడ్డీస్‌తో RDIF డీల్ కుదుర్చుకుంది. అనంతరం క్లినికల్ ట్రయల్స్ చేశారు. క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు రావడంతో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఏప్రిల్ 13న ఆమోదముద్రవేసింది. స్పుత్నిక్ టీకాకు ఆమోదం తెలిపిన 60వ దేశం భారత్ కావడం విశేషం.

    స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రష్యా ఇది వరకే ప్రకటించింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తర్వాత ఎక్కువ సామర్థ్యం కలిగిన టీకా స్పుత్నికే కావడం గమనార్హం. మన దేశంలో 12.5 కోట్ల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ల పంపిణీకి డాక్టర్ రెడ్డీస్‌‌తో రష్యా డీల్ కుదుర్చుకుంది. అంతేకాదు గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాకీ బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ సంస్థలతో కలిసి మనదేశంలో ఏటా 85 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని RDIF లక్ష్యంగా పెట్టుకుంది
    Published by:Shiva Kumar Addula
    First published: