కరోనా రోగులను శ్మశాన వాటికలోకి గెంటివేత.. ఎమ్మెల్యే సొంతూరిలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ఖానాపూర్ గ్రామం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంతూరు. ఒక ఎమ్మెల్యే సొంతూరిలో కరోనా రోగుల పట్ల ఇలా వివక్ష చూపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 • Share this:
  మనం పోరాడాల్సింది కరోనా వ్యాధిపై..! కరోనా రోగులపై కాదు. కరోనా బాధితులను అంటరాని వారిగా చూడకూడదు. ఈ మాటలను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పదే పదే ప్రచారం చేసినా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. కరోనా రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సమాజం నుంచి వెలివేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా రోగులను ఊరిలోకి రానీయకుండా స్థానికులు అడ్డుకోవడంతో, వారిని శ్మశాన వాటికలో క్వారంటైన్ చేశారు వైద్య సిబ్బ్ంది. నారయణ్ ఖేడ్ మండలం ఖానాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

  ఖానపూర్ గ్రామానికి చెందిన కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదని.. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని డాక్టర్లు తెలిపారు. కరోనా కిట్ అందజేసి ఆ మందులను క్రమం తప్పకుండా వాడాలని చెప్పారు. మాస్క్‌లు ధరించడంతో పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదని జాగ్రత్తలు చెప్పారు. ఐతే గ్రామస్తులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా బాధితులు ఊరి లోపల ఉండటానికి వీళ్లేదని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో.. దిక్కుతోచని స్థితిలో వారిని గ్రామ శివారులో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికలో క్వారంటైన్ చేశారు.

  ఖానాపూర్ గ్రామం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంతూరు. ఒక ఎమ్మెల్యే సొంతూరిలో కరోనా రోగుల పట్ల ఇలా వివక్ష చూపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పేరుతో ముగ్గురు వ్యక్తులను స్మశానవాటికలో పెట్టడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మానవత్వం ఉందా లేదా అని పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ప్రశ్నించారు. ఒక మనిషిని సాటి మనిషిగా చూడలేని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మంత్రులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వివక్షత కాదా మండిపడ్డారు. వెంటనే స్మశాన వాటికలో ఉన్న వ్యక్తులను ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వారికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: