Delta Variant: వ్యాక్సిన్ తీసుకున్నా నో గ్యారంటీ.. కరోనా రావచ్చు.. ఎయిమ్స్ హెచ్చరిక

(ప్రతీకాత్మక చిత్రం)

Corona delta Variant: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే ఆ వైరస్ రాదని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ డెల్టా వేరియెంట్.. మహా ముదురు అని తేలింది. కరోనా టీకాలు వేసుకున్నా ఇది వ్యాపిస్తుందని ఎయిమ్స్ వెల్లడించింది.

  • Share this:
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. అటు కోవిడ్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గాయి. హమ్మయ్య.. అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో.. ఎయిమ్స్ బాంబు పేల్చింది. కరోనా వ్యాక్సిన్‌లు వేసుకున్నా.. కరోనా సోకవచ్చని తెలిపింది. గతేడాది అక్టోబర్లో భారత్లో బయటపడ్డ డెల్టా వేరియంట్ కరోనా వేగవంతమైన వ్యాప్తికి కారణమని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా డోసులు వేసుకున్నా సరే డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం ఉందని ఎయిమ్ ఢిల్లీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) ప్రత్యేక అద్యయనం వెల్లడించింది. బ్రిటన్లో బయటపడ్డ అల్ఫా వేరియంట్ కన్నా ఈ డెల్టా వేరియంట్.. 40 నుంచి 60 శాతం అత్యంత ప్రభావం కలిగి ఉంటుందని, భారత్లోని ఎక్కువ ఇన్ఫెక్షన్ల వెనుక దీని ప్రభావం ఉందని ఎయిమ్స్ వెల్లడించింది.

ఐదు నుంచి ఏడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన 63 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ 63 మందిలో 53 మందికి కొవాగ్జిన్ సింగిల్ డోస్ ఇచ్చారు. మిగతా వారికి కొవిషీల్డ్ సింగిల్ డోస్ ఇచ్చారు. వారిలో 41 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. అయితే, ఆశ్చర్యకరంగా సింగిల్ డోస్ తీసుకున్న వారిలో 76.9 శాతం మంది డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్కు గురయ్యారని, డబుల్ డోసులు తీసుకున్న 60 శాతం మంది కూడా ఇన్ఫెక్షన్కు గురయ్యారని తేలింది. దీంతో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్లనే కాదు, ఆల్ఫా వేరియంట్పై కూడా సమర్థవంతంగా పనిచేయడంలో విఫలమయ్యాయి. అంటే, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేసుకున్నప్పటికీ.. డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం కొంతవరకు ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

అయితే అతి తక్కువ మందిపై చేసిన ఈ అధ్యయనం ఎంత వరకు విశ్వసనీయం అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను కాకుండా, కేవలం వ్యాక్సిన్ డోసులపైనే దృష్టి సారించిన ఈ ఎయిమ్స్, ఎన్సిడిసి అధ్యయన ఫలితాలపై నిపుణుల సమీక్ష జరగాల్సి ఉంది.

కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ తీసుకున్న 63 మందిలో ఒక్కరు కూడా కరోనా కారణంగా మరణించలేదని అధ్యయనం పేర్కొంది. కాకపోతే, ఈ డెల్టా వేరియంట్ ఉనికి సింగిల్ డోస్ తీసుకున్న 60 శాతం మందిలో, డబుల్ డోస్ తీసుకున్న 77 శాతం మందిలో కనుగొన్నట్లు అధ్యయనం తెలిపింది. కాగా కేవలం ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందున్న రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. హై-గ్రేడ్ జ్వరం, ఊపిరితిత్తులు, తలనొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి డేటా సేకరించారు. ఈ అధ్యయనం కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ సహకారం తీసుకున్నారు. డెల్టా వేరియంట్ సంక్రమణను నివారించడంలో ఈ రెండు వ్యాక్సిన్లు అంతగా పనిచేయడం లేదని వారి అధ్యయనంలో తేలింది. అయినప్పటికీ, తీవ్రమైన వ్యాధులను నివారించడంలో మాత్రం ఈ టీకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది.
Published by:Shiva Kumar Addula
First published: