సౌతాఫ్రికాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో కొత్త మహమ్మారిపై భయాందోళనలు పెరిగాయి. భారతీయుల ఆందోళనను మరింత పెంచుతూ రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ రెండో కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో రెండో కేసుతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు పెరిగింది.
ఢిల్లీలో శనివారం ఓమిక్రాన్ వేరియంట్లో రెండో కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ఇటీవలే జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి శాంపిళ్లను పరీక్షించగా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవలే అతను సౌతాఫ్రికాకు కూడా ప్రయాణించినట్లు ట్రావెల్ హిస్టరీలో వెల్లడైంది.
ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిది కాగా, ఇప్పుడ రెండో కేసు జింబాబ్వే నుంచి వచ్చిన ప్రయాణికుడిగా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (LNJP)లో చికిత్స పొందుతున్నారు. అక్కడ ఒమిక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం తెలిసిందే. ఒమిక్రాన్ రెండో కేసు వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా,
ఢిల్లీలో కొత్త కేసుతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రెండుకు పెరిగింది. అటు మహారాష్ట్రలో ఏకంగా ఏడు కొత్త కేసులు వచ్చాయి. వారిలో మూడున్నరేళ్ల చిన్నారికి కూడా ఒమిక్రాన్ ఉండటం అందరినీ కలవరపెడుతున్నది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముంబై నగరంలో శనివారం నుంచి సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. జనం గుంపులుగా తిరగడం, సభలు, సమావేశాలు అన్నిటినీ నిషేధించారు. కాగా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణను వాయిదా వేసిన కేంద్రం.. అంతర్జాతీయ ప్రయాణాలపైనా నిషేధం విధించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Delhi, Omicron, Omicron corona variant