Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా, డెంగ్యూ

ఈనెల 23న ఆయన కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరగా, పరీక్షల్లో భాగంగా ఆయనకు డెంగ్యూ కూడా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు మనీష్ సిసోడియా కార్యాలయం ప్రకటించింది.

news18-telugu
Updated: September 24, 2020, 10:33 PM IST
Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా, డెంగ్యూ
మనీష్ సిసోడియా
  • Share this:
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ఆస్పత్రిలో చేరారు. మనీష్ సిసోడియాకు డెంగ్యూ జ్వరం కూడా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీ ప్రభుత్వ నడుపుతున్న ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఐసీయూలో మనీష్ సిసోడియా చికిత్స పొందుతున్నారు. ఈనెల 23న ఆయన కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరగా, పరీక్షల్లో భాగంగా ఆయనకు డెంగ్యూ కూడా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు మనీష్ సిసోడియా కార్యాలయం ప్రకటించింది. ‘ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనారోగ్యానికి గురయ్యారు. డెంగ్యూతో బాధపడుతున్నారు. ఆయన బ్లడ్ ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతోంది. ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ కూడా నిర్ధారణ అయింది.’ అని సిసోడియా కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. 48 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ సపోర్టు అందిస్తున్నారు. సెప్టెంబర్ 14న మనీష్ సిసోడియాకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 14న ఒకరోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు.

మరోవైపు దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం రెండో దశకు సంకేతమన్నారు. కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందని ప్రకటించిన తొలి రాష్ట్రం ఢిల్లీ కావడం విశేషం. దేశ రాజధానిలో ఇంతలా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే పరిణామమని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో సెప్టెంబర్ 9వ తేదీన తొలిసారి 4 వేల కేసులు దాటాయి. అదే రోజు 20 మంది మరణించారు. వైరస్ దేశ రాజధానిని తాకిన అనంతరం అత్యధికంగా సెప్టెంబర్ 16న 4 వేల 473 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో రోజూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా 83,347 కేసులొచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,46,010కి చేరింది. నిన్న ఒక్క రోజులో 1085 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 90020కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో మరణాల రేటు 1.59 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న 89,746 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 45,87,613కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 81.25 శాతానికి చేరింది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎక్కువ రికవరీ రేటు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 9లక్షల 68వేల 377 ఉన్నాయి. మొన్నటితో పోల్చితే... యాక్టివ్ కేసులు 7484 తగ్గాయి.

ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 24, 2020, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading