Dead Man Returns: చనిపోయాడని అంత్యక్రియలు చేశారు.. వారం తర్వాత తిరిగొచ్చాడు.. అసలు కథేంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడనుకొని ఓ ఫ్యామిలీ అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసింది. అయితే వారు అంతిమ సంస్కారాలు చేశామని అనుకున్న వ్యక్తి.. వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. అతడిని చూసి అందరూ షాకయ్యారు.

  • Share this:
ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తుండడంతో ఒక్కోసారి పరిస్థితి గందరగోళంగా మారుతోంది. బతికి ఉన్న మనిషి చనిపోయాడని వేరే భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జైపూర్​​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడనుకొని ఓ ఫ్యామిలీ అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసింది. అయితే వారు అంతిమ సంస్కారాలు చేశామని అనుకున్న వ్యక్తి.. వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. అతడిని చూసి అందరూ షాకయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొచ్చాడని ఖంగుతిన్నారు. చివరకు పొరపాటు చేశామని తెలుసుకున్నారు. అసలు మొత్తం కథేంటంటే..

గోవర్ధన్ ప్రజాపత్ అనే వ్యక్తి జైపూర్​​లోని ఆర్​కే ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆ తర్వాత అతడి మృతదేహం గుర్తుపట్టని విధంగా తయారైంది. కొన్నిరోజుల తర్వాత ఓంకార్​ లాల్​ గుడిలియా అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు చనిపోయాడని భావించి, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చారు. పొరపాటున గోవర్ధన్ మృతదేహాన్ని తమ సొంత ఊరైన రాజస్థాన్​ రాజ్​సమంద్ జిల్లాకు తీసుకెళ్లారు. ఆ మృత దేహం గడులియాదే అనుకొని అంత్యక్రియలు చేశారు.

మద్యానికి బానిసైన ఓంకార్ గడులియా కుటుంబ సభ్యులకు చెప్పకుండా మే11న ఉదయ్​పూర్​ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాలేయ సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరాడు. లాక్​డౌన్ ఉండడంతో గడులియా కుటుంబం సోదరుడి ఇంట్లో ఉంటోంది. కాగా, మే 11వ తేదీనే ఓ ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా గోవర్ధన్​ ప్రజాపత్ అనే వ్యక్తిని మోహి ప్రాంతం నుంచి ఆర్​కే ఆసుపత్రికి అంబులెన్స్​లో తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ తీవ్ర అనారోగ్యంతో ప్రజాపత్ మృతి చెందాడు.

“మూడు రోజుల నుంచి ఓ గుర్తుతెలియని మృతదేహం తమ మార్చురీలో ఉందని ఆసుపత్రి వర్గాలు మాకు తెలిపాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఫొటోను మేం వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేశాం’ అని కన్​క్రోలీ పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వో యోగేంద్ర వ్యాస్ తెలిపారు. ఇదే సమయంలో గుడిలియా అనుకొని పొరపాటుగా ఆ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారని యోగేంద్ర చెప్పారు. చేతికి ఒకేరకమైన మచ్చ ఉండడంతో వారు పొరపాటు పడి ఉంటారని తెలిపారు. వారు కచ్చితంగా చెప్పడంతో శవానికి పోస్టుమార్టం, డీఎన్​ఏ టెస్టులు చేయకుండా ఆసుపత్రి వారికి మృతదేహాన్ని అప్పగించింది.

ఇక తమ సొంత ఊరికి గోవర్ధన్​ మృతదేహాన్ని తీసుకెళ్లిన కుటుంబం.. గడులియా అనుకొని మే 15నే అంత్యక్రియలు నిర్వహించింది. అయితే మే 23న గడులియా ఇంటికి తిరిగివచ్చేయడంతో అందరూ షాకయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగిరావడంతో ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేయగా గడిలియా అనుకొని గోవర్దన్ ప్రజాపత్ అనే వ్యక్తి మృతదేహానికి వారు అంతిమ సంస్కారాలు చేశారని గుర్తించారు.
Published by:Shiva Kumar Addula
First published: