Cow Urine: గో మూత్రం తాగుతా.. అందుకే కరోనా రాలేదు.. మీరూ తాగండి.. బీజేపీ ఎంపీ సలహా

ప్రగ్యా సింగ్ ఠాకూర్

గోమూత్రం తాగితే కరోనా మన దరిచేరదని ప్రగ్యా సింగ్ ఠాకూర్ చెప్పారు. తాను నిత్యం ఆవు మూత్రాన్ని సేవిస్తానని.. అందుకే నాకు కరోనా రాలేదని తెలిపారు.

  • Share this:
    కరోనా మహమ్మారి విజృంభణతో భారత్ విలవిల్లాడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా పీడ విరగడ కాలేదు. ఆక్సిజన్, మందుల కొరతతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందుతున్నా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య శాస్త్రానికే లొంగని ఆ వైరస్.. గోమూత్రానికి పారిపోతుందని కొందరు అంటున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు గోమూత్రం సేవించాలని చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ కూడా చేరారు. గోమూత్రం తాగితే కరోనా మన దరిచేరదని చెప్పారు. తాను నిత్యం ఆవు మూత్రాన్ని సేవిస్తానని.. అందుకే నాకు కరోనా రాలేదని తెలిపారు.

    ఆదివారం భోపాల్‌లోని సంత్‌నగర్‌లో పర్యటించారు ప్రగ్యాసింగ్. హెడ్గేవర్ ఆస్పత్రికి 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పాశ్చాత్య అలవాట్లను అనుసరించడం, చెట్లను నరకడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని అన్నారు. ''దేశీ ఆవు మూత్రం తాగితే ఎలాంటి వ్యాధులు రావు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తగ్గిపోతుంది. నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా గోమూత్రాన్ని మాత్రం ప్రతి రోజూ సేవిస్తా. అందుకే నాకు కరోనా రాలేదు. ఎలాంటి మందులు కూడా అవసరం లేదు. నేను సరైన మందునే తీసుకుంటున్నా. భవిష్యత్‌లో కూడా నాకు కరోనా రాదనుకుంటున్నా.'' అని తెలిపారు.

    అంతేకాదు ఆక్సిజన్ కొరతకు కూడా తనదైన శైలిలో పరిష్కారం చూపించారు భోపాల్ ఎంపీ. ''మనం వేప, మర్రి, తులసి, రావి చెట్లను విరివిగా పెంచాలి. ఆ చెట్లు 24 గంటలూ ఆక్సిజన్ అందిస్తాయి. ఒకవేళ మనం చెట్లునాటి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఈ సంక్షోభానికి మనమే కారణం. ప్రతి కుటుంబం కూడా కనీసం 10 మొక్కలు నాటాలి. మనం మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఆక్సిజన్ కొరత ఉండదు. అందుకే అందరూ మొక్కలు నాటండి.'' అని ప్రగ్యాసింగ్ పిలుపునిచ్చారు.

    ఇటీవల యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కూడా గోమూత్రం తాగాలని పిలుపునిచ్చారు. రోజు ఎంత తాగాలో? ఏ సమయంలో సేవించాలో చెబుతూ డెమో వీడియో కూడా చేశారు. స్వయంగా గోమూత్రం తాగి చూపించారు. ఆవు మూత్రం సేవిస్తే కరోనా రాదని చెప్పారు. ఐతే గోమూత్రంతో కరోనకు అడ్డుకుట్ట వేయచ్చనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
    Published by:Shiva Kumar Addula
    First published: