Andhra Pradesh: ఏపీలో ఏం జరుగుతోంది..? బ్లాక్ మార్కెట్ లో వ్యాక్సిన్ ఎలా దొరుకుతోంది?

బ్లాక్ మార్కెట్ లో కోవీషీల్డ్

ఏపీలో వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది తొలి డోస్ తీసుకుని.. 50 రోజులు దాటుతున్నా రెండో డోసు అందడం లేదు. ఇక తొలి డోస్ ఎప్పుడు వేస్తారో అన్నది సమాధానం లేని ప్రశ్నే.. ఇలాంటి సమయంలో బ్లాక్ మార్కెట్లో భారీగా వ్యాక్సిన్ లభించడం ఆందోళన పెంచుతోంది.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా ఓ వైపు కరోనా వైరస్ వెంటాడుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ వేసుకుందామని ప్రజలు అనుకుంటున్నా అందుబాటులో ఉండడం లేదు. తొలి డోస్ వేసుకోవాలి అనుకున్న వారి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఇక తొలి డోస్ వేసుకుని 50 రోజులు దాటుతున్నా..  రెండో డోస్ దొరకడం లేదు. కేంద్రం నుంచి వస్తున్న డోసుల సంఖ్య సరిపడకపోవడంతో చాలా చోట్ల నో వ్యాక్సిన్ బోర్డులు కనిపిస్తున్నాయి.. ఇంత డిమాండ్ ఉన్న సమయంలో.. కోవిడ్ వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్ లోకి ఎలా వస్తున్నాయి అన్నది అంతు చిక్నని ప్రశ్నగా మారింది..

    ఏపీలో వ్యాక్సిన్ నిల్వలు.. పంపిణీ పై లెక్కాపత్రం ఉండదా..? ఒక్కో వ్యాక్సిన్ వైల్ ఎన్ని డోసులు వేయాలి,ఎన్ని డోసులు వేస్తున్నారు..? ఇలాంటివి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే అని విపక్షాలు విమర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ లో విక్రయించడం సంచలనంగా మారింది...

    ఈ వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ అమ్మకంలో ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ప్రమేయం ఉండటం మరింత ఆందోళన పెంచుతోంది.  శనివారం వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిలో కోటప్పకొండ ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాల సిబ్బంది ప్రమేయం ఉందనే అనుమానాలు దీనికి మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. డాక్టర్ల ప్రమేయం లేకుండా కేవలం కిందిస్థాయి సిబ్బంది వల్ల  ఇటువంటి దోపిడీలు జరిగే అవకాశమే లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు...

    వ్యాక్సిన్ సాధారణంగా ప్రభుత్వం నుండి ఏరోజు ఎన్ని వ్యాక్సిన్లు వచ్చాయి.. ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు.. ఇంకా ఎన్ని టీకాలు నిల్వ ఉన్నాయి అనేది పక్కాగా  రికార్డుల్లో నమోదై ఉండాలి.
    ఐతే ఒక్కొ వ్యాక్సిన్ వైల్ పది మందికి చొప్పున ఉపయోగించాలి. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. పది మందికి వేయాల్సిన వ్యాక్సిన్ ను పన్నెండు నుండి పదిహేను మంది వరకూ ఉపయోగించి డోసుల సంఖ్య పెంచడంతో మిగిలిన డోసులు అక్రమార్కుల బ్లాక్ మార్కెట్ కు తరలించి ఒక్కో డోసు 2000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకూ అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

    అటు పి.హెచ్.సి లల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సరైన పరిమాణంలో వ్యాక్సిన్ లభించక పోవడంతో పాటు ఇటు వ్యాక్సిన్ కొనుక్కుని వేయించుకున్న వారి  జేబులు గుల్ల అవుతున్నాయి. తప్పా అది ఎంత వరకు పని చేస్తుంది అన్నది చెప్పే పరిస్థితి లేదు. పి.హెచ్.సి లల్లో ఇదే తంతు కొనసాగుతుందనే ఆరోపణలు సర్వత్రం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు గట్టి నిఘా ఏర్పాటుచేసి ఇంకా ఎంత మందికి వ్యాక్సిన్ లు వేశారు.  ఈ వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ రాకెట్ లో ఎవరెవరు ఉన్నారనేది బయటకు తీసి..  కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: