తెలంగాణ జర్నలిస్ట్‌కు కరోనావైరస్.. తెలుగు మీడియాలో తొలి కేసు

తెలంగాణ జర్నలిస్ట్‌కు కరోనావైరస్.. తెలుగు మీడియాలో తొలి కేసు

ఫ్రతీకాాత్మక చిత్రం

కరోనాబారిన పడిన జర్నలిస్ట్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందే జర్నలిస్ట్ సోదరుడికి కరోనా ఉంది.

 • Share this:
  కరోనాపై మనవాళి చేస్తున్న యుద్ధంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందు వరసలో ఉన్నారు. ఇక పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. జర్నలిస్టులు సైతం ఫీల్డ్‌లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో కరోనా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ క్రమంలో వీరు కూడా కరోనా బారినపడుతున్నారు. ముంబైలో ఇప్పటికే సుమారు 60 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. తమిళనాడులో ఓ న్యూస్ ఛానెల్‌లో ఏకంగా 27 మంది కోవిడ్ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా తెలంగాణలోనూ ఓ జర్నలిస్ట్‌కు కరోనా సోకింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ న్యూస్ ఛానెల్ విలేఖరికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల మీడియాలో నమోదైన తొలి కరోనా కేసు ఇదే కావడం గమనార్హం.

  కరోనాబారిన పడిన జర్నలిస్ట్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందే జర్నలిస్ట్ సోదరుడికి కరోనా ఉంది. వ్యక్తిగత పనుల కోసం కర్నూల్‌కు వెళ్లాడని.. ఆ తర్వాత అతడికి కరోనా వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌కు హాజరయ్యాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అతడి నుంచే జర్నలిస్ట్‌కు సంక్రమించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధిత విలేకరిని ఎవరెవరు కలిశారన్న దానిపై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి పంపించారు. ఐతే కరోనా బారిన పడిన విలేకరి కొన్ని రోజులుగా విధుల్లో లేడని అధికారులు చెబుతున్నారు.

  పలు చోట్ల జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర సర్కార్‌లు జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయిస్తామని ఇప్పటికే వెల్లడించాయి. కరోనాపై విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుకు హర్యానా ప్రభుత్వం రూ.10 లక్షల బీమా ప్రకటించింది. ఇక తెలంగాణలో పలువురు ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులకు మాస్క్‌లు, నిత్యావసర సరుకులు పంచుతున్నారు. ఐతే ఫీల్డ్‌కు వెళ్లి రిపోర్టింగ్ చేసే విలేకరులకు పీపీఈ కిట్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగానే.. తమకు ఇన్సూరెన్స్ కల్పించాలని జర్నలిస్ట్ యూనియన్లు కోరుతున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు