తెలంగాణకు గుడ్‌న్యూస్.. కరోనాను జయించిన హైదరాబాద్ యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ఒక టెస్టులో అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందని ఈటల రాజేందర్ ప్రకటించారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదని తెలిపారు.

 • Share this:
  తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే..! కరోనా భయంతో వణికిపోతున్న రాష్ట్ర ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ తీపి కబురు అందించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కోలుకున్నాడు. ఒక టెస్టులో అతడికి కరోనా నెగెటివ్ వచ్చిందని ఈటల రాజేందర్ ప్రకటించారు. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి మరో టెస్ట్ రావాల్సి ఉందని.. దాని కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదని తెలిపారు. మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈటల.

  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు లేదు. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు కోలుకుంటున్నాడు. రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తే అతడు సంపూర్ణంగా బయటపడినట్లు భావించాలి. అదృష్టవశాత్తు తొలి టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. ఇవాళ రెండో టెస్ట్ కూడా చేస్తాం. దాని రిపోర్ట్ రేపు వస్తుంది. ఈ క్షణానికి మన రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా కరోనా వైరస్ లేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా విదేశాల నుంచి వస్తున్న ప్రతి ప్రయాణికుడిని పరీక్షిస్తున్నాం.
  ఈటల రాజేందర్


  కాగా, హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అతడు.. కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ నాలుగైదు రోజుల పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న బెంగళూరుకు వచ్చాడు. అనంతరం బస్సులో ప్రయాణించి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి ఔట్ పేషెంట్‌గా వెళ్లాడు. ఫిబ్రవరి 27న అక్కడ అడ్మిట్ అయ్యాడు. టెస్టుల తర్వాత అనుమానం రావడంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో మార్చి 1న సాయంత్రం 5 గంటలకు అతడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో.. ఐసోలేషన్ వార్డుకు తరలించి పది రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని వైద్యులు ప్రకటించారు.

  Published by:Shiva Kumar Addula
  First published: