కరోనా వ్యాక్సినేషన్‌కు అంతా సిద్ధమయింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాలు వేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2934 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధానుల నుంచి ఆయా కేంద్రాలకు టీకాలను తరలిస్తున్నారు. టీకా కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆ రోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తారని తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేస్తారు.
ఏ కేంద్రంలో ఎంత మందికి టీకా వేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అంతే సంఖ్యలో టీకాలను అందుబాటులో ఉంచారు. అవసరమైన వాటికంటే పదిశాతం అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇవి రిజర్వ్డ్ టీకాలని.. అంతేకాదు వేస్టేజ్ అయిన చోట ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. టీకాలు వేసుకునే వారంతా విధిగా కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కేంద్రానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక దానిని వెంట తీసుకెళ్లాలి. టీకా తీసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అంతేకాదు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. తద్వారా రెండో టీకా వేసే సమయంలో గందరగోళానికి తావులేకుండా ఉంటుంది. టీకా వేయడం సులభతరమవుతుంది.
మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి 1.10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను సేకరిస్తోంది. ఒక్కో డోసు ధర రూ.200 గా ఉన్నట్లు వెల్లడించింది. అటు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 55లక్షల డోసుల మేర కేంద్రం కొనుగోలు చేసింది. వీటిలో 38.5లక్షల డోసుల వ్యాక్సిన్‌కు ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనుంది. మరో 16.5 లక్షల డోసులను మాత్రం భారత్ బయోటెక్ ఉచితంగానే అందిస్తోంది.
తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్‌లు ఇచ్చాక.. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వస్తారు. ప్రస్తుతానికి కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లలో తమకు నచ్చిన టీకాను ఎంచుకునే అవకాశం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఏది అందుబాటులో ఉంటే దాన్నే వేసుకోవాలి. కోవిడ్ వాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న 14రోజుల తర్వాతే టీకాల ప్రభావం ప్రారంభమవుతుందని.. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. టీకాలు వేసుకున్న తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine