భారత్ లో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అయితే, వాస్తవంగా ఇన్ఫెక్షన్ సోకుతోన్నవారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలున్నాయి. ఈ నెలాఖరు వరకు మూడో వేవ్ అత్యున్నత దశకు చేరుతోందనే అంచనాల నేపథ్యంలో కొవిడ్ టెస్టులకు సంబంధించి కేంద్రం సంచలన హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్ టెస్టులు తగ్గుతోన్న క్రమంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే టెస్టుల సంఖ్యను పెంచాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖలు రాసింది.
కరోనా ఉధృతి ఉన్నా, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షల నిర్వహణ తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దిష్ట ప్రాంతాల్లో పాజిటివిటీ కేసుల ట్రెండ్ కొనసాగుతున్న దృష్ట్యా వ్యూహాత్మక విధానాలను అనుసరించాలని, తక్షణం కోవిడ్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారంనాడు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది.
వైరస్ వ్యాప్తి జాడను సమర్ధవంతంగా తెలుసుకుని, వ్యాధి విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ పరీక్షలను పెంచాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యల్లో భాగంగా కొత్త క్లస్టర్లు, హాట్‌స్పాట్‌లు గుర్తించాలని, కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.
జనవరి 10న ఐసీఎంఆర్ జారీ చేసిన టెస్టింగ్ స్ట్రాటజీని అన్ని రాష్ట్రాలూ విధిగా అనుసరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతుండగా, కోవిడ్ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల నమోదు తగ్గుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ రాజధానిగా ఉన్న ముంబైతోపాటు మహారాష్ట్ర అంతటా సెల్ఫ్ టెస్టింగ్ కిట్ల అమ్మకాలను నియంత్రించే దిశగానూ ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, Covid cases, Covid test, ICMR