Pregnant Women: కరోనాతో ముందస్తు ప్రసవమయ్యే ప్రమాదం.. గర్భిణులకు కీలక సూచన చేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

గర్భిణీ స్త్రీలలో కోవిడ్-19 ప్రభావం ఇతరులకన్నా భిన్నంగా ఉండదు. కానీ గర్భంతో ఉన్నందువల్ల వారి శరీర వ్యవస్థ అందరిలా ఉండదు. దీంతో వీరిపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.

  • Share this:
కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కరోనా సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో వీలైనంత త్వరగా గర్భంతో ఉన్న మహిళలు టీకాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కడుపుతో ఉన్నవారికి టీకాలు ప్రమాదకరం కాదని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. అందువల్ల అపోహలను నమ్మకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్ తెలిపారు. "గర్భిణీ స్త్రీలలో కోవిడ్-19 ప్రభావం ఇతరులకన్నా భిన్నంగా ఉండదు. కానీ గర్భంతో ఉన్నందువల్ల వారి శరీర వ్యవస్థ అందరిలా ఉండదు. దీంతో వీరిపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలి" అని డాక్టర్ పాల్ వివరించారు.

గర్భిణులకు కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలను గర్భంతో ఉన్న మహిళలు తీసుకోవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకాలు గర్భిణులకు కోవిడ్ ముప్పును తగ్గిస్తాయని వి.కె. పాల్ చెప్పారు. ‘గర్భంతో ఉన్నవారికి కోవిడ్ సోకితే నెలలు నిండక ముందే ప్రసవమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల తల్లీ బిడ్డలు ఇద్దరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కోవిడ్ టీకాలు ఇలాంటి సమస్యలను నివారించగలవు’ అని పాల్ వివరించారు.

భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమైంది. కానీ క్లినికల్ ట్రయల్స్‌లో గర్భిణీ స్త్రీలను చేర్చలేదు. దీంతో గర్భిణులు వ్యాక్సిన్లు తీసుకోవడానికి ప్రారంభంలో అనుమతించలేదు. అయితే తరువాత నిర్వహించిన అధ్యయనాలు మాత్రం.. గర్భంతో ఉన్న వారికి వీలైనంత త్వరగా కోవిడ్ టీకాలు ఇవ్వాలని సిఫారసు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు వ్యాక్సిన్లను సిఫారసు చేసింది. టీకా తీసుకునే ముందు గర్భిణీ స్త్రీలు ఎలాంటి అదనపు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో ఉంది. వివిధ రకాల కరోనా వైరస్ వేరియంట్లు వెలుగు చూస్తున్న నేపథ్యంలో గర్భిణులు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: