Corona Effect: బాలికా విద్యపై కరోనా ప్రభావం, ‘బడికెళితే బతుకెట్లా?’ అంటూ..

Girl Education: త‌క్కువ ఆదాయ వ‌న‌రులు ఉన్న‌కుటుంబాలకు క‌రోనా పీడ‌క‌ల‌గా మారింది. దీంతో వారి కుటుంబాల్లో బాలిక‌లు బ‌డి మానేసి ప‌నికి వెళ్లాల్సి వ‌స్తోంది.

news18-telugu
Updated: September 8, 2020, 4:15 PM IST
Corona Effect: బాలికా విద్యపై కరోనా ప్రభావం, ‘బడికెళితే బతుకెట్లా?’ అంటూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Beti Bachavo, Beti Padhavo: క‌రోనా ‌మహమ్మారి భార‌త్‌లోని బాలిక‌ల విద్యా హక్కుల‌ను హరిస్తోంది.  ఇది భార‌త ఆర్థిక‌, సామాజిక మూలాల‌నూ ప్ర‌భావితం చేస్తోంది. ఇప్ప‌టికే కొవిడ్‌19 కార‌ణంగా జీడీపీ దీర్ఘ‌కాల క‌నిష్ఠానికి ప‌డిపోగా, సామాజిక ప‌రంగా ఎంతోమంది గ్రామీణ బాలిక‌లు, యువ‌తుల భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కం చేస్తోంది. మ‌న దేశంలో బ‌డికి వెళ్లే పిల్ల‌ల్లో సుమారు 89శాతం  మంది మహమ్మారి కార‌ణంగా చ‌దువుకు దూర‌మైన‌ట్టు అంచ‌నా. విద్య‌లో స‌మాన‌త్వం సాధించాల‌న దేశ ఆంకాక్ష‌ను క‌రోనా దూరం చేస్తోంది.

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా మ‌న దేశంలో బాలికా విద్య‌పై అవ‌గాహన పెరుగుతోంది. స్వ‌తంత్రం వ‌చ్చినప్పుడు చదువుకున్న బాలిక‌ల శాతం కేవ‌లం తొమ్మిది శాత‌మే. 2011 నాటికి ఆ సంఖ్య‌ 65 శాతానికి పెరిగింది. ప్రాథ‌మిక స్థాయిలో బ‌డికి వెళ్లే బాలిక‌ల సంఖ్య‌(గ్రాస్ ఎన్‌రోల్మెంట్ రేషియో-జీఈఆర్‌) 1970లో 61శాతం ఉండ‌గా, 2015 నాటికి అది 115శాతానికి పెరిగింది. ఇది బాలుర జీఈఆర్‌తో పోలిస్తే ఏడు శా‌తం అధికం కావ‌డం విశేషం. సెకండ‌రీ లెవ‌ల్ ఫిమేల్ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 1970లో 14శాతం ఉండ‌గా, 2015 నాటికి 75శాతానికి పెర‌గ‌డం మంచి ప‌రిణామం.  ప్ర‌భుత్వాలు కొన్ని ముఖ్య‌మైన అంశాలపై దృష్టి పెడితే క‌రోనా కార‌ణంగా బాలికా విద్య అనే అంశం మ‌రుగున ప‌డ‌కుండా కాపాడుకోవ‌చ్చు.

1995లో పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి పాఠ‌శాల‌ల్లో చేరే బాలిక‌ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. చ‌దువుకు చేసే ఖ‌ర్చు త‌గ్గ‌డంతో పాటు బాలిక‌ల‌కు పోష‌కాహరం అందించ‌డంతో విద్య‌లో లింగ‌స‌మాన‌త్వం పెరిగింది. ఎక్కువ మందిని పాఠ‌శాల‌కు తీసుకురావ‌డంలో ఈ ప‌థ‌కం స‌ఫ‌లీకృత‌మైంది. క‌రోనా ఈ లెక్క‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసింది.  మహమ్మారి విజృంభించ‌డంతో గ‌త విద్యా సంవ‌త్స‌రం పూర్తికాక‌ముందే పాఠ‌శాల‌లు మూసివేశారు. దీంతో పాటు మధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కూడా ఆగిపోయింది. ఈ విద్యా సంవ‌త్స‌రం ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అంటే పోష‌కాల‌తో కూడిన భోజ‌నం అందే అవ‌కాశం లేన‌ట్టే. దీంతో విద్యార్థినుల‌ను బ‌డికి పంపేందుకు త‌ల్లిదండ్రులు ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చు. ఇది కొత్త‌గా పాఠ‌శాల‌ల్లో న‌మోదు చేసుకునే బాలిక‌ల సంఖ్య‌పై తీవ్ర  ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా విద్య‌లో లింగ‌స‌మాన‌త్వం త‌గ్గిపోవ‌చ్చు.  ఈ విష‌యాన్ని సుప్రీం కోర్టు సుమోటాగా స్వీక‌రించింది. ఈ సంవ‌త్స‌రం మార్చి నుంచి అన్ని రాష్ట్రాల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం ప్రారంభించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కేర‌ళ‌లో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లే పిల్ల‌ల ఇంటి వ‌ద్ద‌కు భోజ‌నం ప్యాకింగ్ చేసి చేర‌వేయ‌డం మంచి ప్ర‌య‌త్నం. కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ ప‌థ‌కానికి కేటాయింపుల‌ను 11శాతం పెంచింది. కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా కృషి చేస్తూ ఈ ప‌థ‌కానికి మ‌రింత మందికి చేరువ చేస్తే బాలిక‌ల స్కూల్ డ్రాప‌వుట్ల సంఖ్య ప‌డిపోకుండా కాపాడుకునే అవ‌కాశం ఉంది.

ఒక‌ప్పుడు జ‌నాభాకు త‌గిన సంఖ్య‌లో పాఠ‌శాల‌లు లేక‌పోవ‌డంతో బాలిక‌ల‌ను దూర ప్రాంతాల్లో ఉన్న బ‌డుల‌కు పంప‌డానికి త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డేవారు. కానీ ఇప్ప‌డు ఆ ప‌రిస్థితులు లేవు. దాదాపు 96శాతం గ్రామీణ జ‌నాభాకు సొంత ఊర్లోనే ప్రాథమిక విద్య అందించేలా పాఠ‌శాల‌ల‌ను నెల‌కొల్పారు.  కానీ ఇప్పుడు క‌రోనా కార‌ణంగా పాఠ‌శాల‌ల్లో బోధ‌న ప్రారంభంకాలేదు. ఆన్‌లైన్ క్లాసులతో నెట్టుకొస్తున్నా... సాంకేతిక‌త‌కు దూరంగా ఉంటోన్న బాలిక‌లకు ఇది శాపంగా మారింది. ప‌ట్ట‌ణ జ‌నాభాలో 33శాతం, గ్రామీణ జ‌నాభాలో 28శాతం మంది యువ‌తులు, విద్యార్థినుల‌కే ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉంది. ఇవ‌న్నీ బాలిక‌ల‌కు విద్య‌ను దూరం చేసే ప‌రిణామాలే. పాఠ్య‌పుస్త‌కాల డిజిట‌లైజేష‌న్‌, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌ల పంపిణీ, ఉచిత ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ వంటివి చేయ‌డానికి కేంద్రం ఈ విద్య ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం మంచి విష‌య‌మే అయినా దీని ఫ‌లాలు సామాన్యుల‌కు ఎంత‌మేర‌కు చేరుతాయో తెలియ‌ని  ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఫిమేల్ అన్ఎంప్లాయిమెంట్ రేటు మే 2020 నాటికి 30శాతానికి చేరింది. ఇది మ‌గ‌వాళ్ల‌లో 23శాతంగా ఉంది. ఒక అంచ‌నా ప్ర‌కారం ఏప్రిల్‌, మే నెల‌ల్లో 12మిలియ‌న్ల మంది ఆడ‌వాళ్లు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో గ్రామీణులు 9మిలియ‌న్లు, ప‌ట్ట‌ణాల్లోనివారు 3మిలియ‌న్లుగా ఉన్నారు. ఆదాయం త‌గ్గడంతో విద్య‌కు చేసే ఖ‌ర్చు సైతం త‌గ్గుతుంది. దీంతో బాలిక‌లు పాఠ‌శాల‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు త‌గ్గొచ్చు. దీనిపై ప్ర‌భుత్వాలు దృష్టి పెట్టాలి. బేటీ బ‌చావో, బేటీ ప‌డాలో కార్య‌క్ర‌మం స‌క్ర‌మంగా అమ‌లయ్యేలా చూడాలి.

త‌క్కువ ఆదాయ వ‌న‌రులు ఉన్న‌కుటుంబాలకు క‌రోనా పీడ‌క‌ల‌గా మారింది. దీంతో వారి కుటుంబాల్లో బాలిక‌లు బ‌డి మానేసి ప‌నికి వెళ్లాల్సి వ‌స్తోంది. ఆదాయ మార్గాలు అన్నేషించే త‌ల్లిదండ్ర‌ులు.. స్కూళ్లు తెరిచిన త‌రువాత ప‌ని మాన్పించి పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపించే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే ఇలాంటి కుటుంబాల‌కు ప్ర‌భుత్వాలు ప‌ని క‌ల్పించాలి. ఇవే కాకుండా దేశ జీడీపీలో సుమారు ఆరు శాతాన్ని విద్య‌పై ఖ‌ర్చు చేయాలి. ఇది 2018-19లో కేవ‌లం మూడు శాతంగానే ఉంది. ఈ కేటాయింపుల్లో స‌గ భాగం నేరుగా బాలికా విద్య‌కే కేటాయించాలి. దీంతో పాటు ఏయే ప్రాంతాల్లో బాలిక‌ల పాఠ‌శాల‌ల న‌మోదు శాతం త‌క్కువ‌గా ఉందో గుర్తించాలి. వారికి బ‌డుల‌కు ర‌ప్పించే ఏర్పాట్లు చేయాలి. సాధార‌ణ విద్య‌తో పాటు డిజిట‌ల్ బోధ‌న కూడా అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే బాలికా విద్య‌పై క‌రోనా మహమ్మారి ప్ర‌భావాన్ని నిరోధించొచ్చు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 8, 2020, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading