కరోనాను తరిమికొట్టే వ్యాక్సీన్ వచ్చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇమ్యునైజేషన్ డ్రైవ్‌కు భారత్ సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సీన్ పంపిణీ అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సీనేషన్‌పై దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సీనేషన్‌కు సన్నద్ధత, అమలును పరీక్షించేందుకు ఈ డ్రైరన్ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ దేశ ప్రజలు శుభవార్త తెలిపారు. కరోనా వ్యాక్సీన్ గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ జీబీటీ ఆస్పత్రిలో డ్రైరన్ తీరును పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
'' కరోనా వ్యాక్సీన్ గురించి వస్తున్న పుకార్లను ప్రజల నమ్మవద్దు. వ్యాక్సీన్ ట్రయల్స్‌లో భద్రత, సత్ఫలితాలే మా ప్రాధాన్యత. ఏ విషయంలో రాజీపడబోం. గతంలో పోలియో టీకాల గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలంతా పోలియో వాక్సిన్ తీసుకొని మనదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చారు. ఢిల్లీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సీన్ ఇస్తాం.'' అని హర్షవర్ధన్ పేర్కొన్నారు.
కాగా, కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆ స్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు జైకొట్టింది. అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషీల్డ్‌కు అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు తెలిపారు. ఐతే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) దీనికి తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేశాయి. ఆ వ్యాక్సీన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు ఆ కంపెనీలతో పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో వ్యాక్సీన్లను తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్ల గురించి సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం మొదట కోవిషీల్డ్ వ్యాక్సీన్ వినియోగానికే నిపుణు కమిటీ సిషారసు చేసింది. దీనిపై DCGI ఎలాటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
డీసీజీఐ నుంచి ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేస్తూ.. డ్రైరన్ చేపట్టింది. డ్రైరన్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి.. వ్యాక్సినేషన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే జనవరి 9 నుంచే మనదేశంలో కరోనా వ్యాక్సీనేషన్ డ్రైవర్ ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.