ఢిల్లీని ఆదర్శంగా తీసుకోండి..తెలంగాణ సర్కార్‌కు కేంద్ర మంత్రి సలహా

ఢిల్లీని ఆదర్శంగా తీసుకోండి..తెలంగాణ సర్కార్‌కు కేంద్ర మంత్రి సలహా

గచ్చిబౌలిలోని కోవిడ్ ఆస్పత్రి టిమ్స్‌ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్యం, వసతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.

 • Share this:
  హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో వసతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.  కరోనా రోగులకు చికిత్స కల్పిస్తున్న టిమ్స్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి...కోవిడ్-19 రోగులకు అందుతున్న వైద్య చికిత్సలు, వసతులపై నేరుగా ఆరా తీశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కోవిడ్ రోగులను పరామర్శించిన కిషన్ రెడ్డి...వారికి అక్కడ అందుతున్న వైద్యం, వసతుల గురించి అడిగితెలుసుకున్నారు. టిమ్స్‌లో వసతులపై అసంతృప్తి వ్యక్తంచేసిన కిషన్ రెడ్డి...కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ వసతులు మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. కరోనా కట్టడిలో ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోందని...ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని సూచించారు.  హోమ్ ఐసొలేషన్‌లో ఉండాల్సిన పేషెంట్స్ బయట తిరుగుతున్నారని...వీరిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఇంటి గడపదాటి బయటకు రావద్దని హితవుపలికారు. ఆగస్టు మాసంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్య సిబ్బందికి జీతాలతో పాటు అదనపు ఇన్సెన్టివ్స్ అందించాలన్నారు.  కరోనా బారినపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలని...ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని కిషన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.
  Published by:Janardhan V
  First published: