Delta Variant: డెల్టా వేరియంట్‌తో కొత్త సమస్య.. ఆ లోపం ఏర్పడే అవకాశం..!

ప్రతీకాత్మక చిత్రం

డెల్టా వేరియంట్ సోకి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, భారత్లో కరోనా సెకండ్ వే‌వ్‌కు కారణమైన ఈ డెల్టా వేరియంట్‌తో ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.

  • Share this:
భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన డెల్టా వేరియంట్ కారణంగా అనేక కోవిడ్ మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ బ్రిటన్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. డెల్టా వేరియంట్ సోకి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, భారత్లో కరోనా సెకండ్ వే‌వ్‌కు కారణమైన ఈ డెల్టా వేరియంట్‌తో ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్, వైట్, ఎల్లో ఇలా రకరకాల ఫంగస్ కేసులు బయటపడగా.. ఇప్పుడు కొత్తగా వినికిడి లోపం ఉన్న కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలో వినికిడి లోపంతో కొత్తగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక వైద్యులు.. కొంతమంది కరోనా రోగుల్లో ఈ సమస్యను గుర్తించారు.

దీనిపై కర్ణాటకలోని ఫోర్టిస్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఈఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ సుషీన్ దత్ మాట్లాడుతూ.. “కోవిడ్– 19 న్యూరోట్రోపిక్ వైరస్. ఇది కపాల నాడులపై దాడి చేసే అవకాశం ఉంది. సాధారణంగా కోవిడ్ బారిన పడ్డ వారిలో తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, రుచి వాసన లేకపోవడం వంటివి సాధారణ లక్షణాలు. కానీ, ఈ వేరియంట్ ప్రభావం వల్ల రోగుల్లో కనిపించని వినికిడి లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తం గడ్డ కట్టడం, గ్యాంగ్రేన్ వంటి కొత్త లక్షణాలు కూడా ఇటీవలి కాలంలో బయటపడుతున్నాయి. కాబట్టి, భారత్లోకి విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా చెప్పవచ్చు. దీని వల్ల కరోనా సోకిన వారిలో వినికిడి లోపం కూడా సంభవించవచ్చు. కరోనా నుంచి కోలుకున్నాక వినికిడి లోపంతో మా వద్దకు వస్తున్న పేషెంట్ల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం” అని అన్నారు.

వినికిడి లోపం కోవిడ్‌తో ముడిపడి ఉందని అనేక అధ్యయనాలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఫస్ట్ వేవ్ సమయంలోనూ కొంత మంది రోగుల్లో ఈ వినికిడి సమస్య తలెత్తింది. అందువల్ల, కేవలం డెల్టా వేరియంట్ కారణంగానే వినికిడి లోపం సమస్య వచ్చిందని చెప్పలేం. ఇక, ఈ సమస్యపై కొలంబియా ఆసియా హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడారు. “ఫస్ట్ వేవ్ సమయంలో కూడా చాలా మంది రోగులు ఇయర్ బ్లాక్ లక్షణాలతో మా వద్దకు వచ్చారు. వినికిడి లోపం సమస్యలను పరిష్కరించేందుకు వారికి మెడిసిన్, శస్త్రచికిత్సలను అనుసరించాం. తద్వారా, అనేక మంది రోగులు ఈ సమస్య నుంచి కోలుకున్నారు. అయితే, సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ కేసులను మళ్లీ చూస్తున్నాం. కానీ ఇది డెల్టా వేరియంట్ వల్ల మాత్రమే వచ్చిన సమస్య అని స్పష్టంగా చెప్పలేం” అని వివరించారు.

ఫస్ట్ వేవ్‌లోనూ ఈ సమస్య..
కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన చాలామందిలో ఇప్పటివరకు శ్వాస సమస్యలు మాత్రమే వస్తుండేవి. అయితే, వారిలో ఇయర్ బ్లాక్ లేదా వినికిడి లోపం కూడా వచ్చే అవకాశం ఉందని, దీని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. “పేషెంట్లు చెవి బ్లాక్ లేదా వినికిడి లోపం ఎదుర్కొన్నప్పటికీ, కరోనా భయంతో ఈఎన్టీ స్పెషలిస్ట్ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తుంటారు. అలా కాకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి” అని డాక్టర్ సంతోష్ చెప్పారు. ఇదిలా ఉంటే దేశంలో బ్లాక్ ఫంగస్‌ కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.
Published by:Sumanth Kanukula
First published: