గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం మాయం...

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం మాయమైంది.

 • Share this:
  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం మాయమైంది. హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన రషీద్ అలీ ఖాన్ అనే వ్యక్తి కరోనాతో గాంధీతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఈనెల 10వ తేదీన అతడు చనిపోయినట్టు గాంధీ ఆస్పత్రి నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో బంధువులు కనీసం కడసారి చూపు కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే, మార్చురీలో వారికి రషీద్ మృతదేహం కనిపించలేదు. 24 గంటలు గడిచినా ఇంకా మృతదేహం ఏమైందనే వివరాలు తెలియలేదు. దీనిపై రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు గాంధీ ఆస్పత్రి సిబ్బంది, మరోవైపు పోలీసులు రషీద్ డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు. కోవిడ్ 19 మీద కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం.. ఎవరైనా కరోనాతో చనిపోతే వారి డెడ్ బాడీలను బంధువులకు అప్పగిచరు. కేవలం ఓసారి వారికి చూపించి మున్సిపల్ సిబ్బందే నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరుపుతారు. ఈ క్రమంలో రషీద్ కుటుంబానికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. తమకు కనీసం చివరి చూపు కూడా దక్కలేదని వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గాంధీలో సిబ్బంది నిర్లక్ష్యం మీద మండిపడుతున్నారు.

  కొన్ని రోజుల క్రితం మధుసూధన్ అనే వ్యక్తి కరోనాతో చనిపోతే కనీసం తమకు చూపించకుండానే అంత్యక్రియలు నిర్వహించడం మీద ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తన భర్త బతికి ఉన్నాడా? చనిపోయాడా? చెప్పాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అప్పటి పరిస్థితుల్లో బాధితురాలు కూడా కరోనాతో ఉండడంతో భర్త చనిపోయిన విషయం చెబితే తట్టుకోలేదని బంధువులు చెప్పడం వల్ల తామే అంత్యక్రియలు నిర్వహించామంటూ గాంధీ ఆస్పత్రి అధికారులు కోర్టుకు తెలిపారు. చివరకు మధుసూదన్ అస్తికలు అందజేయాలని కోర్టు చెప్పడంతో ఆ కథ ముగిసింది.

  ఇక రెండు రోజుల క్రితం డెడ్ బాడీ తారుమారు అయిందంటూ ఓ రోగి బంధువులు వైద్యుల మీద దాడి చేశారు. తెలంగాణలో కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్లకు గాంధీ ఆస్పత్రి ఒక్కటే దిక్కుగా మారిందని, దీని వల్ల తమ మీద ఒత్తిడి పెరుగుతోందంటూ జూనియర్ డాక్టర్లు కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వల్ల 157 మంది చనిపోయారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: