New Corona Variants: డెల్టా, లాంబ్డా, కప్పా వేరియంట్లలో ఏది ప్రమాదకరం.. పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా తరువాత ఇప్పుడు కప్పా అనే కొత్త రకం కరోనా వైరస్ ప్రజల ఆందోళనను మరింత పెంచింది.

  • Share this:
కరోనా వైరస్ కొత్త వేరియంట్లు సైన్స్, శాస్త్రవేత్తలకు సవాలు విసురుతున్నాయి. మూల వైరస్ అయిన సార్స్-కోవ్-2 ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటోంది. భారత్‌తో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ వందకు పైగా దేశాల్లో వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ తరువాత డెల్టా ప్లస్ వేరియంట్ భయపెట్టింది. కొత్తగా కప్పా వేరియంట్ కరోనా వైరస్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత వారం ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డ ఈ వేరియంట్ కేసులు.. ప్రస్తుతం రాజస్థాన్‌లోనూ నమోదయ్యాయి. రాష్ట్రంలో ఏడు కప్పా వేరియంట్ కేసులను గుర్తించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో కరోనా పాజిటివ్ రోగుల శాంపిల్స్‌ను జన్యు విశ్లేషణకు పంపారు. ఢిల్లీలోని ఒక ల్యాబ్‌కు, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి వీటిని పంపించారు. మొత్తం 174 శాంపిల్స్‌లో.. 166 డెల్టా వేరియంట్‌కు, ఐదు కప్పా వేరియంట్‌కు చెందినవిగా గుర్తించారు. గత వారం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో 109 శాంపిల్స్‌ను జన్యు విశ్లేషణకు పంపగా.. 107 శాంపిల్స్ డెల్టా ప్లస్, రెండు కప్పా వేరియంట్ కేసులు ఉన్నట్లు కనుగొన్నారు. డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా తరువాత ఇప్పుడు కప్పా అనే కొత్త రకం కరోనా వైరస్ ప్రజల ఆందోళనను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, వాటికి సమాధానాలు...

* కరోనా వైరస్ కప్పా వేరియంట్ ప్రమాదకరంగా మారుతుందా?
డెల్టా మాదిరిగా కప్పా వేరియంట్ కూడా డబుల్ మ్యుటెంట్ కరోనా వైరస్. దీని శాస్త్రీయ నామం B.1.617.1 కరోనా వైరస్. ఇందులో రెండు మ్యుటేషన్లు ఉంటాయి. E484Q, L453R అనే ఉత్పరివర్తనాలు ప్రమాదరకంగా మారే అవకాశం ఉంది. అయితే డెల్టా, డెల్టా ప్లస్ మాదిరిగా ఎక్కువ ప్రమాదం కలింగిచకపోవచ్చు.

* ఈ వేరియంట్‌ కొత్తగా వెలుగు చూసిందా?
కప్పా వేరియంట్.. కొత్త రకం కరోనా వైరస్ కాదు. కప్పా వేరియంట్‌ను తొలిసారిగా 2020 అక్టోబర్‌లో భారతదేశంలో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కాకుండా డెల్టా వేరియంట్‌ను కూడా భారతదేశంలోనే మొదటిసారి కనుగొన్నారు.

* కప్పా వేరియంట్ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ కప్పా వేరియంట్‌ను దృష్టి సారించాల్సిన రకం లేదా 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' గా ప్రకటించింది. డెల్టా వైరస్ మాత్రం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ లేదా ఆందోళన రకం జాబితాలో ఉంది. అంటే కప్పా వేరియంట్‌ కంటే డెల్టా ఎక్కువ ప్రమాదకరమని అర్థం. కప్పా వేరియంట్‌ జన్యు క్రమం గురించి ఇప్పటికే తెలిసిందని, దీన్ని గుర్తించేందుకు పరీక్షలు, చికిత్స మార్గాలు అందుబాటులో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే సరైన నివారణ పద్ధతులు పాటించకుంటే మాత్రం.. ఈ వేరియంట్‌ కూడా సామాజిక వ్యాప్తికి, కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని WHO వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న చికిత్స పద్ధతులతో కొత్త వేరియంట్‌ను నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

* కప్పా వేరియంట్‌ను వ్యాక్సిన్లు సమర్థంగా నిరోధిస్తాయా?
కప్పా వేరియంట్‌లో L453R అనే మ్యుటేషన్ ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుందని, కరోనా యాంటీబాడీలు సైతం దీన్ని ప్రభావితం చేయకపోవచ్చని కొందరు నిపుణులు గుర్తించారు. అయితే ఈ వాదనను నిరూపించడానికి లేదా వ్యతిరేకించడానికి అవసరమైన శాస్త్రీయ డేటా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కప్పా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసిఎంఆర్ ఇటీవల తెలిపింది. కోవిషీల్డ్ సైతం కప్పా వేరియంట్‌ను నిరోధిస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. భారత్‌లో ప్రస్తుతం ఎక్కువ మందికి ఈ రెండు వ్యాక్సిన్లనే ఇస్తున్నారు. అందువల్ల కొత్త వేరియంట్‌ గురించి ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

* కప్పా వేరియంట్‌ నివారణ మార్గాలేవి?
అన్ని రకాల కరోనా వేరియంట్లను ముందు జాగ్రత్తల ద్వారానే నిరోధించవచ్చు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి కోవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. దీంతో పాటు వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు సైతం తప్పకుండా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి.

* ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కప్పా వేరియంట్ ముప్పు తగ్గుతుందా?
ప్రజలందరూ అందుబాటులో ఉన్న ఏదో ఒక వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వీటి ద్వారా శరీరంలో అభివృద్ధి చెందే కొద్దిపాటి యాంటీబాడీలు సైతం కరోనా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వ్యాక్సిన్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. కోవాగ్జిన్‌ను ఇన్ యాక్టివేటెడ్ వైరస్ నుంచి, కోవిషీల్డ్‌ను వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫాం ద్వారా అభివృద్ధి చేశారు. ఫైజర్, మోడెర్నా మాత్రం ఎం-ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు. వివిధ వేరియంట్లపై వీటి ప్రభావశీలత స్థాయిలు మారవచ్చు. అయితే ఏ వ్యాక్సిన్ అయినా.. ఒకే డోసు తీసుకుంటే తక్కువ మొత్తంలోనే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ప్రజలందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: