news18-telugu
Updated: November 6, 2020, 6:16 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్-19 దుష్ప్రభావాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి వల్ల చెవిలో, తలలో శబ్దం వస్తున్నట్లు అనిపించే టిన్నిటస్ (tinnitus) అనే రుగ్మత తీవ్రత పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి(ARU) చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా 48 దేశాలకు చెందిన 3,103 మంది నుంచి వివరాలు సేకరించారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, బ్రిటన్‌కు చెందినవారు ఉన్నారు. కరోనా బారిన పడిన వారిలో సుమారు 40 శాతం మందిలో టిన్నిటస్ తీవ్రత పెరుగుతున్నట్లు అధ్యయన బృందం గుర్తించింది. గతంలో టిన్నిటస్ బారిన పడిన వారిపైనే ఈ పరిశోధన చేశారు. కరోనా లక్షణాలు బయట పడుతున్న కొద్దీ, టిన్నిటస్ తీవ్రత పెరిగినట్లు కొంతమంది చెప్పారు. ఇది కరోనా వైరస్‌కు దీర్ఘకాలిక లక్షణంగా మారే అవకాశముందని వారు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా పాటిస్తున్న సామాజిక దూరం వల్ల టిన్నిటస్ మరింత ఎక్కువైనట్లు పరిశోధనలో పాల్గొన్నవారు భావించారని అధ్యయనం వెల్లడించింది. ఇది పని, జీవనశైలిలో మార్పులకు కారణమవుతున్నట్లు బాధితులు చెప్పారు.
బ్రిటన్ వాసులకు ప్రమాదం ఎక్కువఇతర దేశాల ప్రజలతో పోల్చితే బ్రిటన్‌లో ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లో దాదాపు 46 శాతం మంది ప్రజలు టిన్నిటస్ జీవనశైలి మార్పులపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. ఉత్తర అమెరికాలో 29 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంతో పోలిస్తే మహమ్మారి సమయంలో టిన్నిటస్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నామని ఆడవాళ్లు, 50 ఏళ్లలోపు వయసు ఉన్నవారు చెప్పారు. టిన్నిటస్ తీవ్రత పెరిగినా, కోవిడ్ -19 ప్రభావం వల్ల దానికి సరైన చికిత్స అందట్లేదని అధ్యయనం పేర్కొంది. ఇది మానసిక క్షోభను, భయాందోళనలను మరింత పెంచే అవకాశం ఉంది.
వినికిడి శక్తిపై ప్రభావం
ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్‌తో పాటు జీవనశైలి మార్పులు వంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ టిన్నిటస్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే వివరాలను ఈ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్- 19 టిన్నిటస్ ఉన్నవారి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. కరోనా లక్షణాలు పెరిగినప్పుడు టిన్నిటస్ తీవ్రత కూడా పెరుగుతుందని, దీని వల్ల కొన్నిసార్లు వినికిడి సమస్యలు కూడా ఎదురవుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు. ఇది క్లినికల్, సపోర్ట్ సర్వీసెస్ రెండింటి ద్వారా నిశితంగా పరిశీలించాల్సిన విషయమని పరిశోధకులు చెబుతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 6, 2020, 6:10 PM IST