స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు అనారోగ్యాలను ముందుగానే గుర్తించగలవని ఇంతకు ముందు చేసిన అధ్యయనాల్లో తేలింది. తాజాగా ఇవి కోవిడ్-19 కేసులను కూడా ముందుగానే గుర్తించగలవని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వచ్చే అవకాశాన్ని ఇవి కొన్ని రోజుల ముందుగానే గుర్తించగలవని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హెల్త్ సిస్టమ్ (Mount Sinai Health System), కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University) వంటి ప్రముఖ సంస్థలు ఈ పరిశోధనలు చేశాయి. ఫిట్‌బిట్, గార్మిన్, యాపిల్ వంటి కంపెనీలు అభివృద్ధి చేసిన స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు గుండె కొట్టుకునే వేగంలో తేడాలను గుర్తించగలవు. వీటి ద్వారా శరీరంలో అనారోగ్యాలు వెలుగుచూసే అవకాశాన్ని మనం ముందుగానే గుర్తించి, జాగ్రత్తలు తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మన ఆరోగ్యం బాగా ఉండి, శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లూ లేకపోయినా.. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులకు అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనకు నాడీ వ్యవస్థ ప్రతిస్పందించినప్పుడు హార్ట్ బీట్ రేటు మారుతుంది. ఒకవేళ శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే నాడీ వ్యవస్థ నెమ్మదిగా స్పందిస్తుంది. దీనివల్ల కూడా హార్ట్ బీట్ రేటు తగ్గే అవకాశం ఉంది.
ఎలా అంచనా వేయాలంటే...
మౌంట్ సినాయ్ అధ్యయన బృంద సభ్యుడు రాబర్ట్ హిర్టెన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో (Icahn School of Medicine) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్ల సాయంతో అంటువ్యాధుల ప్రమాదాలను సైతం ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. ‘అంటువ్యాధులను నియంత్రించడానికి ఇది ఒక మార్గం. శరీరంలో మంటగా (inflammation) అనిపించినప్పుడు గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు వస్తాయి. కోవిడ్ కూడా శ్వాస సంబంధ అనారోగ్యాలకు, కడుపులో మంటకు కారణమవుతుంది. ఇలాంటివారు అప్రమత్తమై లక్షణాలు లేకపోయినా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. ట్రాకర్ల ద్వారా హార్ట్ బీట్ రేటులో తేడాలను బట్టి, ఎలాంటి లక్షణాలు బయట పడకముందే కరోనా సోకినట్లు అంచనా వేయవచ్చు’ అని రాబర్ట్ వివరిస్తున్నారు.
వైరస్‌ను గుర్తించవచ్చు
కోవిడ్-19తో పాటు ఇతర అనారోగ్యాలను స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్ల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ మైఖేల్ స్నైడర్ తెలిపారు. ‘ఈ రోజుల్లో కోవిడ్-19 పరీక్షల ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల వైరస్‌ను గుర్తించడంలో కొన్నిసార్లు ఆలస్యమవుతోంది. ఫిట్నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు’ అని స్నైడర్ వివరిస్తున్నారు.
అనారోగ్యాలను అంచనా వేయాలి
ఈ అధ్యయనానికి యాపిల్, గార్మిన్, ఫిట్‌బిట్, ఇతర సంస్థలు స్పాన్సర్‌గా వ్యవహరించలేదని పరిశోధకులు తెలిపారు. ధరించగలిగే ట్రాకర్లలో (wearable trackers) గుర్తించే హార్ట్ బీట్ రేటులో తేడాలను అనారోగ్యాలను సంకేతంలా భావించాలి. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులను గుర్తించినప్పుడు ముందుజాగ్రత్తగా డాక్టర్లను సంప్రదించాలి. దీంతో అనారోగ్యాలను ముందుగానే గుర్తించడం వారికి సులువు అవుతుంది. హార్ట్ ఎటాక్, ఇతర గుండె సంబంధ అనారోగ్యాలను ఫిట్నెస్ ట్రాకర్ల సాయంతో ముందుగానే గుర్తించిన ఉదంతాలు గతంలో చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి.