ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronvirus) సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు వదిలారు. అయితే వైరస్‌కు టీకాలు రావడం, క్రమంగా కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కరోనాలోని కొన్ని వేరియంట్స్ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) అన్ని దేశాలనూ ఆందోళనకు గురిచేస్తుంది. ఇది కరోనాలోని మిగతా వేరియంట్స్ కంటే ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని దక్షిణాఫ్రికా (South Africa)లో మొదటిసారి గుర్తించారు. అయితే వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషిస్తున్న క్రమంలో.. కొత్త వేరియంట్‌లోని మ్యుటేషన్లను మొదటిసారి చూసిన ఓ శాస్త్రవేత్త తీవ్రమైన ఆందోళనకు గురయ్యారట. ఈ వివరాలను ఆమె తాజాగా పంచుకున్నారు.
సౌతాఫ్రికాలోని అతిపెద్ద ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్ అయిన లాన్సెంట్ ల్యాబొరేటరీ (Lancet laboratory)లో పనిచేస్తున్న రాక్‌వెల్ వియన్నా.. ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటిసారి కనుగొన్నారు. ఎనిమిది కరోనా వైరస్ శాంపిల్స్ జన్యువులను పరీక్షిస్తున్న క్రమంలో, వాటిలో కొత్త ఉత్పరివర్తనాలను ఆమె గుర్తించారు. దీంతో వాటిని చూసిన తరువాత షాక్ అయినట్లు చెప్పారు. భారీ స్థాయిలో స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్లు ఉండటంతో వైరస్ జన్యువిశ్లేషణ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగిందేమోనని భావించినట్లు చెప్పారు. ఇదంతా భారీ పరిణామాలకు దారి తీస్తుందనే భావన కలిగినట్లు పేర్కొన్నారు.
Vaccine Offer: బంపర్ ఆఫర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఈ విషయమై ఆమె వెంటనే జోహన్నెస్‌బర్గ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD)లోని తన సహోద్యోగి అయిన జీన్ సీక్వెన్సర్ డేనియల్ అమోకోను సంప్రదించింది. తాను కనుగొన్న కొత్త రకం వైరస్ వేరియంట్ గురించి ఫోన్‌లో వివరించింది. ఇది మరో కొత్త వేరియంట్‌లా కనిపిస్తోందని అమోకోకు వివరించింది.
Omicron: భయపెడుతున్న కరోనా Omicron.. భారత్ మూడో దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా ?
ఎన్ఐసీడీ (NICD)లోని అమోకో బృందం నవంబర్ 20, 21 తేదీలలో వియన్నా పంపిన ఎనిమిది నమూనాలను పరీక్షించారు. వీటన్నింటికీ ఒకే విధమైన ఉత్పరివర్తనలు ఉన్నట్లు గుర్తించారు. ముందు అమోకో బృందంలోని జోసీ ఎవెరాట్, ఇతర సభ్యులు కూడా ఎక్కడో పొరపాటు జరిగిందని భావించారు. అదే వారంలో కొత్త వేరియంట్‌ను సూచిస్తున్నట్లుగా, కొవిడ్ కేసులలో గణనీయమైన పెరుగుదలను వారు గమనించారు. నవంబర్ 23 మంగళవారం నాటికి జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా చుట్టుపక్కల నుంచి మరో 32 మందిని పరీక్షించిన తర్వాత వారికి భయానక పరిస్థితి అర్థమైంది. మొత్తానికి ఇది మరో కొత్త కరోనా వైరస్ మ్యుటేషన్ అని శాస్త్రవేత్తల బృందం నిర్ధారణకు వచ్చింది.
No Vaccine No Treatment: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం బంద్.. సీఎం కీలక నిర్ణయం
నవంబర్ 23న ఎన్ఐసీడీ (NICD) బృందం దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ, ఇతర ల్యాబ్‌లకు ఈ విషయం గురించి తెలియజేసింది. అదే రోజు ఎన్ఐసీడీ... గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో ఈ డేటాను నమోదు చేసింది. బోట్స్‌వానా, హాంకాంగ్ లో కూడా అదే జన్యు శ్రేణితో కేసులు బయటపడినట్లు వారు కనుగొన్నారు. నవంబర్ 24న NICD అధికారులు ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు తెలియజేశారు. దానికి వారు ఒమిక్రాన్ అనే పేరు పెట్టారు. అప్పటికే గౌటెంగ్, ప్రిటోరియా, జోహన్నెస్‌బర్గ్ లో మూడింట రెండు వంతుల పాజిటివ్ టెస్టులు కొత్త వేరియంట్ కారణంగానే నమోదవుతున్నట్లు వారు భావించారు. భారీ స్థాయిలో మ్యుటేషన్లు ఉండటంతో WHO దీన్ని ఆందోళనకరమైన వేరియంట్‌గా వర్గీకరించి, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటం, దీనికి వేగంగా వ్యాపించగలిగే లక్షణాలు ఉండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు ఈ ప్రాంతం నుంచి రాకపోకలను పరిమితం చేశాయి. టీకాలు తీసుకున్న వారిపై కూడా ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందనే భయంతో అన్ని దేశాలు కోవిడ్ మార్గదర్శకాలపై దృష్టిసారించాయి. దక్షిణాఫ్రికాలో రోజువారీ కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు ఈ వారం చివరి నాటికి నాలుగు రెట్ల నుంచి 10,000 రెట్లు పెరుగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి? ఏ వయసు వారిలో ఇది తీవ్రంగా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనటానికి శాస్త్రవేత్తలకు మరింత డేటా అవసరం. డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఇదే విషయం చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Coronavirus, Covid-19, Omicron