దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దీనిపై పలు రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. జనవరి 13 నుంచి టీకా వేస్తారంటూ ఇటీవల పేపర్లు, టీవీ, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 16వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భారత ప్రభుత్వం చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటగా హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా టీకా లభిస్తుంది. వీరంతా కలిపి దేశంలో సుమారు 3 కోట్ల మంది వరకు ఉంటారని కేంద్రం అంచనా వేసింది. మొదట వీరందరికీ కరోనా టీకా వేసిన తర్వాత క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారికి టీకా వేస్తారు. అందులోనూ శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ప్రయారిటీలో టీకా వేస్తారు. వీరంతా కలిపి సుమారు 27 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో హైలెవల్ కమిటీ సమావేశమై.. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద చర్చించింది. ఈనెల 11న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వర్చువల్ భేటీకి ముందే కేంద్రం వ్యాక్సిన్ డ్రైవ్ మీద ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రధాని మోదీ నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌కు ఎంత సన్నద్ధంగా ఉన్నారనే అంశంపై సమగ్రంగా చర్చించారు. కరోనా వ్యాక్సిన్లు Covishield, Covaxinలకు ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిపై కూడా చర్చించినట్టు తెలిసింది.
ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రోజు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం అవుతుంది. అలాగే, కరోనా వ్యాక్సిన్‌ను తరలించే ప్రక్రియ, వాటిని నిల్వచేసే విధానం ఎలా ఉండాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన వివరాలు, సూచనలతో గైడ్ లైన్స్ విడుదల చేసింది. మరోవైపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉందని సీఎన్‌బీసీ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఈ వార్తను ప్రచురించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 09, 2021, 16:40 IST