ప్రపంచంలో అతిపెద్ద ట్రయల్స్... ఒకేసారి 30వేల మందికి కరోనా వ్యాక్సిన్

Coronavirus updates : అమెరికాలో కరోనా వైరస్‌కి సరైన వ్యాక్సిన్‌గా గుర్తిస్తున్న మోడెర్నా.. మూడో దశ ట్రయల్స్ ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 28, 2020, 5:59 AM IST
ప్రపంచంలో అతిపెద్ద ట్రయల్స్... ఒకేసారి 30వేల మందికి కరోనా వ్యాక్సిన్
ప్రపంచంలో అతిపెద్ద ట్రయల్స్... ఒకేసారి 30వేల మందికి కరోనా వ్యాక్సిన్ (credit - twitter - reuters)
  • Share this:
పదులు కాదు, వందలు కాదు... ఏకంగా 30 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమంటే మాటలా? అంతమందికి ట్రయల్స్‌లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా ఒప్పుకుందంటే దానర్థం... ఆ వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తుందనే నమ్మకమే. ప్రపంచవ్యాప్తంగా 150 కరోనా వ్యాక్సిన్లు తయారవుతుంటే... వాటిలో అమెరికా నుంచి మోడెర్నా కంపెనీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ mRNA-1273 ఇప్పటివరకూ రెండు దశల ట్రయల్స్‌లో బాగా పనిచేసింది. అందుకే మూడో దశలో అమెరికాలోని 70 చోట్ల 30 వేల మంది వాలంటీర్లపై మూడో ట్రయల్స్ ప్రారంభించింది. దీనికి కరోనా వైరస్ ఎఫికసీ స్టడీ (కోవే స్టడీ) అని పేరు పెట్టింది.

ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్లపై ఇంత పెద్ద ట్రయల్స్ ఏ కంపెనీ కూడా చెయ్యలేదు. మూడో ట్రయల్స్‌లో ముందుగా జార్జియా రాష్ట్రంలోని సవానాకు చెందిన వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇదో ప్రత్యేకమైన ట్రయల్. ఎందుకంటే... 30 వేల మందిలో... అందరికీ mRNA-1273 వ్యాక్సిన్ ఇవ్వరు. కొందరికే ఇస్తారు. మిగతావారికి ప్లసీబో (సెలైన్‌ లేదా మరో వ్యాక్సిన్‌) ఇస్తారు. అంటే... తమకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారో... వాలంటీర్లకు తెలీదు. ప్రతి వారికీ 2 డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్లను గమనిస్తూ ఉంటారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు రోజూలాగే ఉండొచ్చు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన పనిలేదు.

మోడెర్నా కంపెనీ... అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ (NIAID)తో కలిసి పనిచేస్తోంది. అందువల్ల ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంది. మోడెర్నా వ్యాక్సిన్ కూడా... ఇతర వ్యాక్సిన్ల లాగానే... మనుషులకు వేసినప్పుడు... జ్వరం, చలి, వణుకు, నొప్పి వంటివి తెప్పించింది. ఇవన్నీ మొదటి దశ ట్రయల్స్‌లో కనిపించాయి. రెండో ట్రయల్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ చెప్పుకోతగ్గ స్థాయిలో కనిపించలేదు. మూడో ట్రయల్స్‌తో ఈ వ్యాక్సిన్ కోట్ల మందికి ఇవ్వొచ్చా లేదా అన్నది తేల్చేస్తారు. ఇందుకు టైమ్ పడుతుంది. అందుకే కంగారు పడకుండా... డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ ప్రజల చేతికి చేరుతుందని అంటున్నారు.

వ్యాక్సిన్ల తయారీపై అమెరికా ప్రభుత్వ ఒత్తిడి బాగా ఉంది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల సప్లైకి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం డీల్స్ కుదుర్చుకుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యాక్సిన్ బాగుందని తెలిసినా... దాని కోసం అమెరికా వెంటనే భారీ ఆర్డర్ ఇస్తోంది. ఎందుకంటే వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలయ్యాక... విపరీతమైన డిమాండ్ కారణంగా... సరైన సప్లై ఉండకపోవచ్చు. అందువల్ల ట్రంప్ ప్రభుత్వం ముందుగానే ప్లాన్ ప్రకారం... వ్యాక్సిన్లను కొనేస్తోంది. కరోనాపై విజయం సాధిస్తే... అధ్యక్ష ఎన్నికల్లో తనను ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే... వీలైనంత త్వరగా వ్యాక్సిన్ కావాలని ఆయన కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 28, 2020, 5:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading