Oxygen: మిత్రుడు కాదు నిజంగా దేవుడు.. జార్ఖండ్ నుంచి యూపీకి వెళ్లి ఆక్సిజన్ ఇచ్చాడు..

ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం మధ్యాహ్నం తన కారులో బొకారో నుంచి నోయడాకు బయలుదేరారు దేవేంద్ర. మొత్తు మూడు రాష్ట్రాల మీదుగా 1440 కి.మీ. ప్రయాణించి చివరకు సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందడంతో రంజన్ ప్రాణాలతో బయటపడ్డారు.

  • Share this:
    కోవిడ్ కాలంలో అంతా కన్నీటి గాథలే.. ఎక్కడ చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి.  చావులు.. ఏడుపులతో..  అన్నిచోట్లా విషాధ ఛాయలే అలుముకున్నాయి. ఇలాంటి కష్ట కాలంలోనూ కొందరు సమాజ సేవ చేస్తున్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు పరితపిస్తున్నారు. నిజంగా వారంతా మనుషుల రూపంలో ఉన్న దేవుళ్లు. అలాంటి కోవలోకే వస్తారు ఝార్ఖండ్‌కు చెందిన దేవేంద్ర. తన మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి చలించిపోయారు. అందరిలా బాధపడుతూ కూర్చోకుండా.. భగీరథ ప్రయత్నమే చేశారు. తన మిత్రుడి కోసం ఏకంగా ఝార్ఖండ్‌లోని బొకారో నుంచి యూపీలోని నోయిడాకు ఆక్సీజన్ సిలిండర్ తీసుకెళ్లారు. సకాలంలో ఆక్సిజన్ అందించి తన మిత్రుడి ప్రాణాలు కాపాడారు.


    38 ఏళ్ల దేవేంద్ర బొకారోలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మిత్రుడు రంజన్ అగర్వాల్ ఢిల్లీలో ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇటీవలే రంజన్ ఫ్యామిలీ కరోనాబారినపడింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంజన్ అగర్వాల్‌కు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎంత ప్రయత్నించినా... ఎవరిని సంప్రదించినా దొరకలేదు. చివరకు ఈ విషయం దేవేంద్రకు తెలిసింది. తాను స్టీల్ ప్లాంట్ ఉన్న బొకారాలోనే ఉంటున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ నుంచి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఎలాగైనా తన ఫ్రెండ్ ఫ్యామిలీ కోసం ఆక్సిజన్ సిలిండర్ సాధించాలని ప్రయత్నించారు దేవేంద్ర.

    బొకారోలోని చాలా స్టీల్‌ప్లాంట్‌లు తిరిగారు. ఐతే తమకు ఖాళీ సిలిండర్ ఇస్తేనే.. ఆక్సిజన్ నింపి ఇస్తామని చెప్పారు. కానీ దేవేంద్రకు ఎక్కడా ఖాళీ సిలిండర్ దొరకలేదు. చివరకు బలిదీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆక్సిజర్ సిలిండర్ దొరికింది. ఆక్సిజన్ ధర రూ.400. కానీ సిలిండర్‌కు రూ.10వేలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకున్నారు. తన మిత్రుడు ఉన్న పరిస్థితులను చూసి.. ఆ పది వేల రూపాయలను దేవేంద్ర లెక్క చేయలేదు. వెంటనే డబ్బులు కట్టి సిలిండర్ తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం తన కారులో బొకారో నుంచి నోయడాకు బయలుదేరారు దేవేంద్ర. మొత్తు మూడు రాష్ట్రాల మీదుగా 1440 కి.మీ. ప్రయాణించి చివరకు సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందడంతో రంజన్ ప్రాణాలతో బయటపడ్డారు.

    దేవేంద్ర కారులో ఆక్సిజన్ సిలిండర్ తరలిస్తున్న క్రమంలో బీహార్‌లో ఒకసారి, యూపీలో మరొకసారి పోలీసులు ఆపారు. ఈ ఆక్సిజన్ ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నావా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. తన మిత్రుడు పరిస్థితిని వివరించి చెప్పడంతో వాళ్లు వదిలేశారు. తన ఫ్రెండ్ కోలుకునేంత వరకు నోయిడాలోనే ఉంటానని చెప్పారు దేవేంద్ర. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాతే తిరిగి ఝార్ఖండ్ వెళ్తానని వెల్లడించారు. దేవేంద్ర చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. నువ్వు మిత్రుడివి కాదు.. దేవుడివి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: