Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిలిపివేసిన భారత్.. కారణం ఇదే..

Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిలిపివేసిన భారత్.. కారణం ఇదే..

కోవిషీల్డ్ వ్యాక్సీన్ (Image:Serum)

మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కోసం కోట్లాది టీకాలు అవసరమవుతాయి. అందుకే సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను ముందు మన దేశ అవసరాలకే వినియోగించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు టీకాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది.

  • Share this:
    భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. కొత్త కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత సర్కార్ కరోనా నివారణ చర్యలను కట్టుదిట్టం చేస్తోంది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఎగుమతులు ఆగిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాల మధ్య వ్యాక్సిన్ పంపిణీ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని డబ్ల్యుహెచ్‌వో ఇప్పటికే తెలిపింది. ఐనప్పటికీ దేశీయ అవసరాల దృష్ట్యా కోవిషీల్డ్ ఎగుమతులను నిలిపివేశారు.


    ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల్లో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఒకటి. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రజెనికా టీకాను కోవిషీల్డ్ పేరుతో ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇక్కడి నుంచి ఎన్నో దేశాలకు టీకాను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 76 దేశాలకు 6 కోట్ల డోసులను భారత్ ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికం కోవిషీల్డ్ టీకాలే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకోనుంది.

    మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కోసం కోట్లాది టీకాలు అవసరమవుతాయి. అందుకే సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను ముందు మన దేశ అవసరాలకే వినియోగించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు టీకాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. మళ్లీ మేలోనే ఇతర దేశాలకు టీకా ఎగుమతి అయ్యే అవకాశముంది.

    కాగా, మనదేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. బుధవారం 47,262 కేసులు నమోదయ్యాయి. 23,907 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. మరో 275 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు మనదేశంలో 1,17,34,058 కేసులు నమోదవగా.. 1,12,05,160 మంది కోలుకున్నారు. 1,60,441 మంది మరణించారు. ప్రస్తుతం 3,68,457 యాక్టివ్ కేసులున్నాయి. భారత్‌లో నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్‌, కర్నాటక, ఢిల్లీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను కఠితరం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు