ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వ్యాక్సిన్ గురించే చర్చ జరుగుతోంది. అమెరికా, యూకే, రష్యాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాయి. ఇక మనదేశంలోనూ వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే టీకా పంపిణీ చేసే అవకాశముంది. ఐతే ముందుగా వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వృద్ధులకు కరోనా వాక్సీన్ అందజేస్తారు. ఆ తర్వాతే సాధారణ ప్రజలకు టీకా వేస్తారు. ఈ నేపథ్యంలో వాక్సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వాక్సీన్‌ను వార్తలను క్యాష్ చేసుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య చాలా మందికి కరోనా వ్యాక్సిన్ గురించి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని.. మీకు వాక్సిన కావాలా..? అని అవతలి నుంచి అడుగుతున్నారు. వాక్సిన్ కావాలంటే రూ.500 చెల్లించాలని చెబుతున్నారు. ఓ యాప్ ద్వారా తమకు డబ్బులు చెల్లిస్తే మీకు ముందుగా వాక్సీన్ అందుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఆధార్, ఈ-మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ పేరుతో OTP నంబర్ కోసం కూడా ర్వికెస్ట్ చేస్తున్నారు. ఆ మాయ మాటలు నమ్మి.. వివరాలు చెబితే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఐతే ఇవి అక్రమార్కులు చేసే ఫోన్ కాల్స్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ ఫేక్ కాల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్, హర్యానా కేంద్రంగా ఇలాంటి ఫేక్ కాల్స్ వెళ్తున్నాయని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:December 30, 2020, 08:31 IST