news18-telugu
Updated: March 17, 2020, 6:25 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మూడో స్టేజ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత రైల్వే శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీ కారణంగా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండటంతో అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ను ఐదింతలు పెంచారు. సికింద్రాబాద్ సహా దేశ వ్యాప్తంగా దాదాపు 250 రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్‌ఫాం టిక్కెట్‌ను రూ.50కి పెంచుతూ రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముంబై, పుణె, బుసావల్, సోలాపూర్ డివిజన్లలోని రైల్వే స్టేషన్లలో పెంచిన ఫ్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉన్న మరికొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.15, 20,30,40 కి పెంచారు. ప్రయాణీకులను విడిచిపెట్టేందుకు రైల్వే స్టేషన్ల లోపలికి వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కి పెంచే యోచనలో ఉన్నారు రైల్వే అధికారులు. ప్లాట్‌ఫాం టికెట్‌ను పెంచే విషయంలో సంబంధిత జోనల్ కార్యాలయాలు నిర్ణయం తీసుకుంటాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్లాట్‌ఫాం టికెట్ల పెంపు తాత్కాలికమేనని, కరోనా వైరస్ కట్టడిలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు తగ్గించనున్నట్లు చెప్పారు.
Published by:
Janardhan V
First published:
March 17, 2020, 5:47 PM IST