షాకింగ్... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

యూకేలో ఇప్పటి వరకు 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు.

  • Share this:
    కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సామాన్య ప్రజలు, డాక్టర్లతో పాటు మంత్రులు, దేశాధినేతలు సైతం కోవిడ్-19 బారినపడుతున్నారు. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ (55)కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారని.. ఐతే పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంటి నుంచే పరిపాలన చేస్తున్నారని.. చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఇక తనకు కరోసా సోకిందన్న విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
    కాగా, యూకేలో ఇప్పటి వరకు 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు. ప్రస్తుతం 4,665 యాక్టివ్ కరోనా కేసులున్నాయని.. అందులో 163 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని యూకే వైద్యాధికారులు తెలిపారు. ఐతే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాన మంత్రికి కూడా కరోనా సోకడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: