హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Tirumala: తిరుమలపై కరోనా పంజా... టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: తిరుమలపై కరోనా పంజా... టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

టీటీడి భద్రతా విభాగంతో పాటు పోలీసు విభాగంలో కూడా ఈ విధానం అమలయ్యేలా టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 50ఏళ్ళ పైబడిన భద్రతా సిబ్బందిని కూడా తిరుమల విధుల నుంచి తప్పించారు భద్రతాధికారులు.

  (బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

  ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతుండడంతో టిటిడి సైతం అప్రమత్తమైంది. తిరుమలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఆరోగ్య భధ్రత దృష్ట్యా షరతులతో కూడిన డ్యూటీని విధించింది. 50ఏళ్ల  పైబడిన వారితో పాటు ఆరోగ్య సమస్యలుండే ఉద్యోగులను విధుల నుంచి తప్పించాలని టీటీడీ నిర్ణయించింది.  గత వారం రోజుల్లో విధి నిర్వహణలో వున్న కొంత మందికి పాజిటివ్ రావడంతో  ఈ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.

  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడి అధికార యంత్రాంగం భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.  భక్తులు తిరుమలకు వచ్చిన మొదలు..  దర్శనం పూర్తి చేసుకొని తిరిగి స్వస్ధలానికి పయనమయ్యేంత వరకు కూడా భక్తులకు సకల సదుపాయాలను కల్పిస్తోంది.  ఇందు కోసం తిరుమలలో టీటీడి ఓ వ్యవస్ధను కూడా ఏర్పాటు చేసింది.

  రిసెప్షన్, భద్రత, అన్నదానం, దర్శనం అంటూ ఇలా దాదాపు 10కి పైగా ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసి.. డిప్యూటీ ఈవో అధికారిని శాఖాధిపతిగా నియమించి.. వారి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఉద్యోగులు తిరుమలలో విధులు నిర్వర్తించేలా పరిపాలన చేస్తోంది. గతంలో శ్రీవారి దర్శనార్ధం నిత్యం 60 నుంచి లక్ష మంది వచ్చేవారు. ఆ భక్తులకు ఎలాంటి సమస్యలు తలైతకుండా పకడ్బంది వ్యవస్ధతో టీటీడి ఏర్పాట్లు చేసేది. ఇందు కోసం తిరుమలలో రొటేషన్ పద్ధతిలో దాదాపు రెండున్నర వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులతో పాటు 4వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాక మరో 2వేల మందికి పైగా శ్రీవారి సేవకుల సేవలను కూడా టీటీడి వినియోగించుకుంటోంది.

  కోవిడ్ 19 నేఫథ్యంలో ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి పూర్తిగా మారింది.  కోవిడ్‌కు ముందు, కోవిడ్ కు తరువాత అన్నట్లు దర్శన విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో నిత్యం వేలాది మంది భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే పరిస్థితి వుండగా...ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే టీటీడి భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది. స్వామి వారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ తిరుమలలో విధులు నిర్వర్తించే ఉద్యోగుల సంఖ్యను టీటీడి తగ్గించే పరిస్థితులు లేవు.

  కరోనా మహమ్మారి తిరుమలలో వ్యాప్తించకుండా మార్చి 20 నుంచి శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. టీటీడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో గత నెల 8 నుంచి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు పున: ప్రారంభమయ్యాయి. కేంద్రం విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.  క్యూ లైనులో భక్తులు ఆరుడుగుల మేర భౌతిక దూరం పాటించేలా  ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తసంచారం అధికంగా వుండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి శానిటైజ్ చేస్తున్నారు.

  మొదట ప్రతి రోజు 6 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించగా....అంచెల వారిగా ఆ సంఖ్యని పెంచారు. ప్రస్తుతం 12 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనార్ధం మన రాష్ట్రం నుంచే కాక దేశంలోని దాదాపు 27 రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుండడంతో.. గత కొద్ది రోజులుగా తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న వారికి పాజిటివ్ వస్తోంది. అలిపిరిలో పని చేసే భద్రతా సిబ్బంది మొదలు తిరుమలలో విధులు నిర్వర్తించే దాదాపు 91 మందికి పాజిటివ్ వచ్చినట్లు టీటీడి అధికారికంగా ప్రకటించారు.

  అనధికారికంగా ఈ సంఖ్య వందకు పైగా నమోదైనట్లు సమాచారం. మరోపక్క చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుండడం..  తిరుమలకు ముఖద్వారమైన తిరుపతిలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదు వస్తుండడంతో.. ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయాని తీసుకుంది. తిరుమలలో విధులు నిర్వర్తించే ఉద్యోగులలో 50ఏళ్ళ పైబడిన వారితో పాటు ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగులు తిరుమలలో విధులు నిర్వర్తించకుండా వెసులబాటు కల్పిస్తూ తాత్కలికంగా తిరుపతికి బదిలీ చేసింది. ప్రత్యామ్నాయంగా తిరుపతిలో విధులు నిర్వర్తించే 30-40 సంవత్సరాల వయస్సు న్న వారికి తిరుమలలో విధులు కేటాయించింది.

  టీటీడి భద్రతా విభాగంతో పాటు పోలీసు విభాగంలో కూడా ఈ విధానం అమలయ్యేలా టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 50ఏళ్ళ పైబడిన భద్రతా సిబ్బందిని కూడా తిరుమల విధుల నుంచి తప్పించారు భద్రతాధికారులు. కరోనా కష్ట కాలంలో కూడా విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు మానసిక ధైర్యం కల్పించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేకంగా అధికారులు, బోర్డు సభ్యులతో ఓ కమిటిని ఏర్పాటు చేసింది టీటీడి పాలకమండలి. ఐతే టీటీడి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ విసృత్తంగా ప్రబలి పలువురి ఉద్యోగులకు పాజిటివ్ వస్తుండడంతో.. ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

  ఉత్తమ కథలు