అమెరికాలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్.. మళ్లీ జడలు విప్పుతోంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు నగరాల నుంచే ఎక్కువ కేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు కాలిఫొర్నియా, ఆరిజోనా, నెవెడా, మిస్సిసిపి, టెక్సాస్, ఓక్లహామా వంటి ప్రాంతాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరల్డ్ మీటర్స్ ఇన్ఫో ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 37,847 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో ఈ స్థాయి కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇంత భారీ మొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి.
రానున్న రోజుల్లో అమెరికాలో మృతుల సంఖ్య మరింత పెరగనుంది. అక్టోబరు నాటికి 1.80 లక్షలకు చేరే ప్రమాదం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ అంచనా వేసింది. టెక్సాస్‌లో రెండు వారాల్లోనే కేసులు ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయాయి. ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో కొన్ని చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు. హ్యూస్టన్ సహా పలు చోట్ల ఐసీయూలన్నీ రోగులతో నిండిపోయాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వాస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడా బెడ్స్ ఖాళీగా లేవు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇలాగే కేసులు పెరిగితే.. పరిస్థితి ఏంటన్న దానిపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.
కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 25,02,251 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 10,48,428 మంది కోలుకోగా..126,726 మంది మరణించారు. ఇంత భారీ మొత్తంలో మరణాలు మరే దేశంలోనూ లేవు. అమెరికాలో ప్రస్తుతం 13,27,097 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 15,729 మంది పరిస్థితి విషమంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Coronavirus, Covid-19, USA