కరోనా మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సాయం చేసింది. కోవిడ్-19 నివారణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సిఎంఆర్ఎఫ్) రూ .5 కోట్లు సమకూర్చింది. ఆన్లైన్ ద్వారా ఈ విరాళాన్ని ఏపీ సీఎం సహాయ నిధికి జమ చేసింది రిలయన్స్ సంస్థ. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారు ఏపీ సీఎం జగన్. మీరిచ్చిన విరాళం కరోనా వైరస్ నివారణ చర్యలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీ రాష్ట్రానికి విరాళం ప్రకటించినందుకు ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు

అంబానీకి జగన్ లేఖ
4 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి కూడా విరాళం అందజేసింది రిలయన్స్ సంస్థ. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) రూ .5 కోట్లు అందించింది. జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన లేఖను అందజేశారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపుపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు PM-CARES సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే రూ. 530 కోట్లకు పైగా అందించింది రిలయన్స్.
కరోనాపై పోరాటంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ముందున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన కోవిడ్ -19 హాస్పిటల్ రిలయన్స్ సహకారంతో ముంబైలో ఏర్పాటైంది. కోవిడ్ -19 బాధితులకు చికిత్స అందించేందుకు దీన్ని కేవలం రెండు వారాల్లోనే సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా రోజుకు 50 లక్షల ఉచిత భోజన ప్యాకెట్లు అందించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కోసం రోజూ లక్ష మాస్క్‌లు ఉత్పత్తి చేస్తోంది. రోజూ వేలాది పీపీఈలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా నోటిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఉచిత ఇంధనం (పెట్రోల్, డీజిల్) అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ప్రతిరోజూ మిలియన్ల మంది భారతీయులకు హోమ్ డెలివరీల ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:April 14, 2020, 22:30 IST