CORONAVIRUS PANDEMIC PLAN YOUR EXPENSES MONTHLY BUDGET EMERGENCY FUND WITH THESE SIMPLE TIPS SS
Coronavirus Effect: మీ డబ్బుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Coronavirus Effect: మీ డబ్బుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
(ప్రతీకాత్మక చిత్రం)
Coronavirus pandemic | దేశంలో ప్రతీ ఒక్కరిపై కరోనా వైరస్ ప్రభావం పరోక్షంగా ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై ఉండటంతో దేశప్రజలంతా ఏదో ఓ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా మేనేజ్ చేయడం తప్పనిసరి.
గతంలో ఎప్పుడు లేని పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయం ఇది. కారణం... కరోనావైరస్ మహమ్మారి. బయట తిరిగితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే. వీలైనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోంచే పనులు చేసుకోవాలి. పేమెంట్స్ నుంచి షాపింగ్ వరకు అన్నీ ఇంట్లోంచే చేయాలి. వ్యాపారాలు తగ్గుతున్నాయి. దీంతో ఆదాయం కూడా పడిపోతోంది. ఇలాంటి సమయంలోనే డబ్బుల్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయలేం కాబట్టి అన్నిటికీ సిద్ధపడి బడ్జెట్ మేనేజ్ చేసుకోవాలి. మరి ఏమేం చేయాలో తెలుసుకోండి.
మీ రోజువారీ ఖర్చులను ఓసారి విశ్లేషించుకోవాలి. అత్యవసరమైనవాటికే ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవాలి. మీ మంత్లీ బడ్జెట్‌ని సమీక్షించుకోవాలి. వృథా ఖర్చులు ఏవైనా ఉంటే ఇప్పుడు తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు అవసరం లేని వస్తువుల్ని అస్సలు కొనొద్దు. వాయిదా వేసుకోవడం మంచిది. అలా మీగిలిన డబ్బుల్ని మీ ఎమర్జెన్సీ ఫండ్‌లోకి మళ్లించాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే... మీ నెలవారి ఖర్చులకు ఆరు రెట్లు. అంటే ఆరు నెలలు మీకు ఆదాయం లేకపోయినా ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేకుండా చూసుకునేలా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి.
మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కరోనా వైరస్ చికిత్సను కవర్ చేస్తుందో లేదో తెలుసుకోవడం మంచిది. ఇప్పటికే ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-IRDAI అన్ని హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు కరోనా చికిత్సను కవర్ చేయాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓసారి మీ ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేసి తెలుసుకోవాలి. అవసరమైతే టాప్ అప్ తీసుకోవాలి.
మీరు మీ హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ ఈఎంఐలను ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో చెల్లిస్తున్నట్టైతే వెంటనే ఆన్‌లైన్‌లోకి మార్చుకోవాలి. ఒకవేళ బ్యాంకులు మూతపడ్డా మీ ఈఎంఐని ఆన్లైన్లో గడువు లోగా చెల్లించొచ్చు. దీని వద్వారా లేట్ ఫీజ్, లోన్ డిఫాల్ట్ తప్పించుకోవచ్చు. ఇంకా వీలైతే ఆటోడెబిట్ ఆప్షన్ ఎంచుకోండి. గడువు తేదీ సమయానికి అకౌంట్లో డబ్బులు ఉండేలా చూసుకోండి.ఒకవేళ మీ ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్-SIP ద్వారా నెలనెలా పొదుపు చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లు పతనమవుతున్నాయి. కాబట్టి మీ ఫండ్స్‌పైన ఓసారి దృష్టిపెట్టండి. మీ అడ్వైజర్‌ని సంప్రదించి ఏవైనా మార్పులు చేయాల్సి ఉందేమో కనుక్కోండి. ఎవరి సలహా తీసుకోకుండా వెంటనే మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్ చేస్తే నష్టమే. అందుకే మీ భవిష్యత్తు అవసరాలు, మీ రిస్క్‌ను విశ్లేషించి నిర్ణయం తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.