కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు జనాలు చనిపోవడమే కాదు..అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విమానాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతున్నాయి. క్రీడా టోర్నీలు వాయిదా పడుతున్నాయి. తాజాగా విశాఖలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరిగే మిలాన్ నేవల్ ఎక్సర్సైజ్ వాయిదా పడింది. విశాఖ తీరంలో మార్చి 18 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో 40 దేశాలు పాల్గొనాల్సి ఉంది. ఐతే మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిలాన్‌ను వాయిదావేసింది నేవీ.
రాబోయే రోజుల్లో మన దేశంలో 2500 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యే అవకాశముందని కేంద్రం అంచనా వేస్తోంది. వారందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక శిబిరాల్లో అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగాలని త్రివిధ దళాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. క్వారంటైన్ సెంటర్స్ (దిగ్బంధ వైద్య పరీక్షా కేంద్రాలు)లో సహాయ సహకారాలు అందించాలని సూచించింది. దాంతో విశాఖలో జరిగే మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్‌ని వాయిదా వేసింది నేవీ. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:March 03, 2020, 19:31 IST