Covid Vaccine Rate: ప్రైవేట్ మార్కెట్‌లో తగ్గనున్న వ్యాక్సిన్ ధర.. రంగంలోకి కేంద్రం

(ప్రతీకాత్మక చిత్రం)

కోవిడ్ వ్యాక్సిన్‌లపై జీఎస్టీని రద్దు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే టీకా తయారీ ముడి పదార్థాలు, ఇతర అత్యవసర మందులపై దిగుమతి సుంకాన్నికూడా రద్దు చేసింది.

  • Share this:
    భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోనుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. అందుకోసం పెద్ద ఎత్తున టీకాలు అవసరమవుతాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వ్యాక్సిన్‌లు కాక.. ప్రైవేట్ మార్కెట్‌లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ప్రైవేట్ సంస్థలకు భారీ ధరకు అమ్ముతున్నాయి. ఇది సామాన్యులకు భారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ మార్కెట్లో ధరలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్‌లపై జీఎస్టీని రద్దు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే టీకా తయారీ ముడి పదార్థాలు, ఇతర అత్యవసర మందులపై దిగుమతి సుంకాన్నికూడా రద్దు చేసింది.


    ప్రస్తుతం మనదేశంలో రెండు టీకాలను వినియోగిస్తున్నారు. భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ఒక్కో డోసును రూ.150కి అమ్ముతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300లకు విక్రయిస్తోంది. ఇక ప్రైవేట్ మార్కెట్‌లో రూ.600 అమ్ముతామని ఇది వరకే తెలిపింది. ఇక భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఒక్కో డోసును రూ.150కి విక్రయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600.. ప్రైవేట్ మార్కెట్‌లో రూ.1200 విక్రయించనున్నట్లు వెల్లడించింది.

    కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలతో పాటు జనాలు కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలపై మండిపడుతున్నాయి. ఒక కంపెనీకి చెందిన టీకాను వేర్వేరు ధరలకు ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి ఒకలా, రాష్ట్రానికి మరోలా.. ప్రైవేట్ మార్కెట్‌లో ఇంకోలా ఎలా అమ్ముతారని కోర్టుకు కూడా నిలదీస్తున్నాయి. మన దేశంలో తయారైన టీకాను మనకే ఎక్కువ ధరకు అమ్ముతారా? అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈక్రమంలోనే సీరం ఇన్‌స్టిట్యూట్ దిగొచ్చింది. రాష్ట్రాలకు అమ్మే వ్యాక్సిన్ ధరలను రూ.400 నుంచి రూ.300కు తగ్గించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: