Coronavirus News: కరోనా మహమ్మారి పేరు వింటే అంటే గజగజ వణికిపోతున్న వారికి ఇది ఊరట కలిగించే వార్త. దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడానికి హెర్డ్ ఇమ్యునిటీయే కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. హెర్డ్ ఇమ్యునిటీ(Herd Immunity) అంటే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతూ క్రమంగా తన శక్తిని కోల్పోవడమే. అంటే కరోనా వైరస్ కూడా జలుబు, దగ్గుకు కారణమవుతున్న మరో సాధారణ వ్యాధిలా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండటానికి హెర్డ్ ఇమ్యునిటీయే కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెర్డ్ ఇమ్యునిటీ కారణంగా కరోనా వైరస్ రోజు రోజుకు బలహీనపడుతున్నట్లు వెల్లడించారు.
దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 79 లక్షలకు చేరుకోగా...దేశంలో ఒక రోజులో 50 వేల కంటే తక్కువగా 45,157 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదుకావడం విశేషం. కరోనా మహమ్మారి కాటుకు దేశంలో ఇప్పటి వరకు 1,19,030 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 90 శాతం మంది(70 లక్షల మంది) కరోనా నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,56,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడానికి హెర్డ్ ఇమ్యునిటీయే కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలటీ - సైన్టిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ జయప్రకాష్ ములియిల్ CNBC TV18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటం శుభసంకేతమని వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటం వాస్తవమని ఆయన పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని పలు ప్రాంతాల ప్రజలపై కరోనా వైరస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోందని డాక్టర్ జయప్రకాష్ అభిప్రాయపడ్డారు. హెర్డ్ ఇమ్యునిటీతో పాటు దేశ ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణమని విశ్లేషించారు.