ఇదే లాస్ట్ ఛాన్స్.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సీరియస్ వార్నింగ్

కోర్టు సహనాన్ని పరీక్షించవద్దన్న హైకోర్టు.. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28న సీఎస్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

news18-telugu
Updated: July 20, 2020, 6:05 PM IST
ఇదే లాస్ట్ ఛాన్స్.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సీరియస్ వార్నింగ్
హైకోర్టు, కేసీఆర్
  • Share this:
కరోనా టెస్టులు, మీడియా బులెటిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఇదే ఆఖరి అవకాశమంటూ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా మీడియా బులెటిన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలు, రాపిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారనే విషయాలను ఆయా జిల్లా కలెక్టర్లు వెల్లడించాలని సూచించింది. అంతేకాదు వైద్యారోగ్యశాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది హైకోర్టు.

అటు కరోనా చికిత్స ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వాట్సప్‌ నంబరును విస్తృత ప్రచారం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని చెప్పింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని ఆదేశించింది. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దన్న హైకోర్టు.. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నెల 28న సీఎస్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా.. అంతకుముందు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. కరోనా పరీక్షల విషయంలో.. ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా వెనకబడి ఉందని మండిపడింది.కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ధ్వజమెత్తింది. కరోనా బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. అంతేకాదు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు అభినందించిందని మీడియా బులెటిన్‌లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం చివాట్లు పెడుతుంటే.. అభినిందించిందని ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారా అని హైకోర్టు విరుచుకుపడింది.

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఐతే కరోనా డిశ్చార్జ్ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటే ఊరట అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 2,65,219 కరోనా శాంపిల్స్ టెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో 12,519 శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇక బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇందులో 1900 బెడ్స్‌ ఆక్యుపై అయింది. 15,181 బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి
Published by: Shiva Kumar Addula
First published: July 20, 2020, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading